Dinesh Karthik: రిషభ్ పంత్ ఓ మ్యాచ్ విన్నర్.. ఎలా ఆడాలో అతనికి తెలుసు!

లండన్: ఇంగ్లండ్ గడ్డపై వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. పంత్ ఓ మ్యాచ్ విన్నరని, ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అతనికి బాగా తెలుసున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు సిరీస్‌లో రిషభ్ పంత్ కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 17.40 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. అయితే, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్ రాణిస్తాడని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ డీకే ఈ వ్యాఖ్యలు చేశాడు.
బ్యాటింగ్ తీరులో కూడా రిషభ్ పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి కొంచెం సమయం ఇచ్చి ఎదగడానికి సహకరించండి. సిరీస్ మధ్యలో రిషభ్.. తన బ్యాటింగ్ తీరులో పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. ఇంగ్లండ్‌లో ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు. పంత్ మ్యాచ్ విన్నర్. అతను రాణిస్తాడనే నమ్మకం నాకుంది' అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రా కాగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఇక లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక కీలక నాలుగో టెస్ట్ సెప్టెంబరు 2న(గురువారం) నుంచి ఓవల్ వేదికగా ప్రారంభంకానుంది. అయితే ఈ ఓవల్ వేదిక పంత్ అచ్చొచ్చిన మైదానం. 2018 పర్యటనలో పంత్ ఇదే మైదానంలో సెంచరీ బాదాడు. అది అతని కెరీర్‌లోనే ఫస్ట్ టెస్ట్ సెంచరీ. అతను రెండో ఇన్నింగ్స్‌లో 146 బంతుల్లో 114 రన్స్ చేసాడు. అయితే 464 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్.. పంత్ సెంచరీ చేసినా ఓటమి తప్పించుకోలేకపోయింది. 118 పరుగులతో చిత్తయి..1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications