
దుబాయ్: ఆసియా కప్ 2022లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంకా చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక్క లీగల్ డెలివరీ వేయకుండానే 9 పరుగులిచ్చుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంత దరిద్రంగా బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా మధుశంకా చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి బంతిని ఫ్రంట్ ఫుట్ నోబాల్‌గా వేసిన మధుశంకా.. ఫ్రీ హిట్‌ను సమర్థవంతంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో బౌన్సర్ సంధించాడు. కానీ అది బ్యాటర్ తలపై నుంచి దూసుకెళ్లడంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ తర్వాత లెగ్ స్టంప్ టార్గెట్‌గా వరుసగా మూడు వైడ్స్ వేసాడు. ఇందులో ఒకటి వికెట్ కీపర్‌ను మిస్సై బౌండరీకి వెళ్లింది. దాంతో ఒక్క లీగల్ డెలివరీ పడకుండానే పాక్ ఖాతాలో 9 పరుగులు చేరాయి.
అనంతర ఎట్టకేలకు లీగల్ డెలివరీ వేయగా సింగిల్ వచ్చింది. దాంతో ఒక్క బంతికే పాక్ 10 పరుగులు పిండుకుంది. అనంతరం మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మధుశంక మొత్తంగా 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మధుశంకా ఇలా వరుసగా వైడ్లు వేయడం చర్చనీయాంశమైంది. మంచి మూమెంట్‌మ్‌తో మ్యాచ్ ప్రారంభించిన శ్రీలంకకు పేలవ ఆరంభాన్ని అందించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వేం బౌలర్ అయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును భానుక రాజపక్స(45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రాజపక్సకు అండగా హసరంగా(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36)రాణించాడు. ఈ ఇద్దరు 6వ వికెట్లకు 58 పరుగులు జోడించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.