
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు ఆడించడం లేదని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశ్నించారు. అతన్ని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేశారని నిలదీశాడు. అశ్విన్‌ను తుది జట్టులో తీసుకోకపోవడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో వరుస వైఫల్యాలతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారు. దీంతో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్ స్పిన్నర్‌ను కాదని అతడిని ఎందుకు తీసుకున్నారని వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు.
'అశ్విన్‌ను చాలా రోజుల నుంచి ఎందుకు పక్కనపెడుతున్నారు? ఈ విషయంపై విచారణ జరపాలి. ఫార్మాట్లకు అతీతంగా అత్యుత్తమ స్పిన్నర్‌గా అతడు రాణిస్తున్నాడు. అలాగే తన ఖాతాలో 600కు పైగా అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. జట్టులో అత్యంత అనుభవం ఉన్న స్పిన్నర్ అతనే. అలాంటిది అతడిని ఎందుకు తీసుకోవడం లేదు? ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో ఆడించలేదు. ఇది నాకస్సలు అర్థంకావడం లేదు. అతన్ని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ఇది పెద్ద మిస్టరీలా ఉంది. అలాగే రెండు మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్లంతా కనీసం తెగువ చూపించలేదు. బయో బబుల్ వల్ల అలా కనిపించారో ఏమో నాకు తెలియదు కానీ, చాలా కాలంగా ఆటగాళ్లలో ఇలాంటి బాడీ లాంగ్వేజ్ చూడలేదు' అని వెంగ్‌సర్కార్ స్పోర్ట్స్ కీదా చానెల్‌తో చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా రవిచంద్రన్ అశ్విన్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతన్ని కోహ్లీ పక్కనపెడుతున్నాడనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీలిప్ వెంగ్ సర్కార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతమే జరగాలి. హ్యాట్రిక్ విక్టరీలతో గ్రూప్2 టాపర్ పాకిస్థాన్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగా.. పాయింట్ల ఖాతానే తెరవని భారత్(-1.61 రన్‌రేట్) ఐదో ప్లేస్‌లో ఉంది. మిగిలిన మ్యాచ్‌ల్లో చిన్న జట్టు అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై గెలిచినా మనోళ్లు సెమీస్ చేరడం కష్టమే. ఎందుకంటే ఈ మూడు టీమ్స్‌తోనే తలపడనున్న న్యూజిలాండ్ రెండింటిలో ఓడాలి, అది అసాధ్యమే అనొచ్చు. ఒక మ్యాచ్‌లో ఓడినా ప్లస్ రన్‌రేట్(0.76)తో కివీస్ ముందంజ వేసే చాన్సుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరడం చాలా కష్టం.