
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత పరాజయానికి చెత్త ఫీల్డింగే కారణమని మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ తెలిపింది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కీలక సమయంలో హర్మన్‌ప్రీత్ రనౌటవ్వడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే భారత ఓటమికి పేలవ ఫీల్డింగ్‌తో పాటు ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోడమే ప్రధాన కారణమని డయానా ఎడుల్జీ అభిప్రాయపడింది. జట్టులోని 15 మంది ఆటగాళ్లకు యో యో టెస్ట్ పెడితే 12 మంది కూడా అర్హత సాధించరని మండిపడింది.
33 నెలలపాటు బీసీసీఐ పాలకమండలిలో కీలక పాత్ర పోషించిన డయానా ఎడుల్జీ.. భారత పరాజయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ మహిళల జట్టుతో పోలిస్తే అండర్- 19 టీమ్ ఫీల్డింగ్ ఎంతో నయమని కొనియాడింది. సీనియర్లలో చాలా మంది ఫీల్డింగ్‌లో తెగ ఇబ్బంది పడిపోయారని పేర్కొంది. ఈ క్రమంలో పలు కీలక సూచనలు చేసింది. ఓ చానెల్‌తో భారత పరాజయంపై స్పందించిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది.

'భారత పరాజయానికి ప్రధాన కారణం ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోవడమే. దాంతో వికెట్ల మధ్య సరిగ్గా పరిగెత్తలేకపోయారు. మైదానంలో చురుకుగా కదల్లేకపోయారు. సీనియర్ క్రికెటర్ల కంటే అండర్ -19 జట్టులోని యువ ప్లేయర్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు . వారు ఫైనల్లోనూ భయపడలేదు. కానీ, 2017 నుంచి 2023 వరకు సీనియర్ల జట్టు మాత్రం కీలకమైన నాకౌట్‌లో వరుస పరాజయాలను చవిచూస్తోంది. అందుకే, బీసీసీఐ తప్పకుండా ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టాలి. యో యో టెస్టు మహిళలకు కాస్త కష్టమే. ఇప్పుడున్న 15 మందికి యో యో టెస్ట్ నిర్వహిస్తే 12 మంది ప్లేయర్లు విఫలమవుతారు. అందుకే ఫిట్‌నెస్ ప్రమాణాలను అంచనా వేయడానికి మరొక విధానం తీసుకు రావాలి. ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌పై జట్టులో జవాబుదారీతనం లేకుండాపోయింది.
ప్రపంచకప్ ఓటమి తర్వాత బీసీసీఐ పరిస్థితిని అంచనా వేసి.. తదుపరి సిరీస్ కోసం పక్కాగా ప్రణాళికలు, సన్నద్ధతపై ఫోకస్ పెట్టాలి. అందులో మొదటిగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫీల్డింగ్, క్యాచ్‌లను పట్టడం, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం తదితర అంశాల్లో మెరుగయ్యేలా చూడాలి. బీసీసీఐ తప్పకుండా కొరడా ఝుళిపించాలి. భారత క్రికెట్ ఉన్నత స్థాయికి చేరాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిసారి గెలవాల్సిన మ్యాచ్‌లను ఓడిపోవడం జట్టుకు అలవాటుగా మారిపోయింది. భవిష్యత్తులో జట్టు సరైన మార్గంలో నడవాలంటే ఉత్తమ ప్రణాళికలతో ముందుకు సాగాలి'అని పేర్కొంది.