మా అమ్మ బంగారం అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది.. ధ్రువ్ జురెల్ భావోద్వేగం!
తన తల్లి బంగారం చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిందని టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ జురెల్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరగనున్న ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కింది. మానసిక ఒత్తిడితో జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ అందుబాటులోకి రావడంతో ధ్రువ్ జురెల్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది.
తొలి సారి టీమిండియా పిలుపును అందుకున్న ధ్రువ్ జురెల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానంటే తొలుత తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపాడు. రూ. 800 అప్పు తెచ్చి తన తండ్రి బ్యాట్ కొనిచ్చాడని.. తన తల్లి బంగారు గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు.

'నేను ఆర్మీ స్కూల్లో చదువుకునేటప్పుడు హాలీడేస్‌లో క్రికెట్ క్యాంప్‌లో చేరాలనుకున్నాను. ఆగ్రాలోని ఎకలవ్య స్టేడియంలో నిర్వహిస్తున్న క్రికెట్ క్యాంప్‌లో చేరేందుకు నా తండ్రికి చెప్పకుండానే దరఖాస్తు చేశాను. ఈ విషయం తెలిసి మా నాన్న బండ బూతులు తిట్టాడు. నేను ఎంతకు వినకపోవడంతో రూ. 800 అప్పు తెచ్చి బ్యాట్ కొనిచ్చాడు.
కానీ నేను క్రికెట్ కిట్ కావాలని అడిగాను. అది కొనడానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించాడు. నేను రూ. 6 వేల నుంచి 8 వేలు అవుతుందని చెప్పాను. వెంటనే క్రికెట్ ఆడటం ఆపేయమని కోప్పడ్డాడు. ఆ మాటలతో తీవ్ర నిరాశకు గురైన నేను బాత్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాను. ఎంత బతిలాడిన బయటకు రాలేదు. చివరకు మా అమ్మ క్రికెట్ కిట్ కొనిస్తానని చెప్పడంతో బయటకు వచ్చాను. ఆమె తన బంగారం చైన్‌ను అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది.
భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయాన్ని మా స్నేహితులు నాకు చెప్పారు. ఇదే విషయాన్ని నేను మా తండ్రికి చెప్పాను. ఆయన ఏ భారత జట్టుకు ఎంపికయ్యావ్? అని అడిగాడు. రోహిత్, విరాట్ కోహ్లీ భయ్యా ఉన్న జట్టుకే ఎంపికయ్యానని చెప్పా. ఈ మాట విని నా కుటుంబం మొత్తం భావోద్వేగానికి గురైంది.'అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.
2020 అండర్ 19 ప్రపంచకప్ ద్వారా ధృవ్ జురెల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీలో దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని తలపిస్తూ మెరుపు స్టంపింగ్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ధోనీ వారసుడు ధ్రువ్ జురెల్ అంటూ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసల జల్లుకురిపించారు.
గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. 172.73 స్ట్రైక్ రేట్‌తో 152 పరుగులు చేశాడు.
2022లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధృవ్ జురెల్.. జూనియర్ లెవల్‌లో 15 రెడ్ బాల్ మ్యాచ్‌ల్లో 46.47 సగటుతో 790 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 47.25 సగటుతో 244 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల భారత్ ఏ తరఫున సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన జురెల్ రెండో మ్యాచ్‌ల్లో 69 పరుగులతో సత్తా చాటాడు. ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలోనూ సత్తా చాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications