ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మారు మోగుతోంది. అరంగేట్ర సిరీస్‌లోనే అసాధారణ ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన జురెల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు అతను మరో ధోనీ అంటూ కితాబిచ్చారు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఆదుకున్నాడు. 90 పరుగులతో భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అయితే రాంచీ టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట ముగిసిన అనంతరం నిద్రలేని రాత్రి గడిపానని జురెల్ గుర్తు చేసుకున్నాడు. 'రెండో రోజు ఆట ముగిసిన అనంతరం నిద్ర లేని రాత్రి గడిపాను. క్రీజులో ఎక్కువ సేపు ఎలా ఉండాలి? జట్టుకు కావాల్సిన పరుగులు ఎలా చేయాలి? అని రాత్రంతా ఆలోచించాను.
నేను ఎంత ఎక్కువ పరుగులు చేస్తే టీమిండియాకు అంత లక్ష్యం తక్కువ అవుతోందనే ఆలోచన నన్ను బాగా వెంటాడింది. దాంతో ఎలా బ్యాటింగ్ చేయాలనేదానిపై సుదీర్ఘంగా ఆలోచించాను. అన్నింటి కంటే ముఖ్యంగా టెయిలెండర్ల మద్దతు ఎలా అందుకోవాలి? వారు క్రీజులో నిలబడాలంటే ఏం చేయాలనేదానిపై నాతో నేను మాట్లాడుకున్నాను.
టెయిలెండర్లకు వారి బ్యాటింగ్‌పై ఆత్మవిశ్వాసం కలిగిస్తే నా పని సులువు అవుతుందని భావించాను. క్రీజులో నిలబడితే.. బ్యాటింగ్‌పై నమ్మకం వస్తుందని చెప్పాను. ఎక్కువ సేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించండని చెప్పాను.'అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.
భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయం తెలిసి తమ కుటుంబం ఎంతో సంతోషానికి గురైందని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు. 'జట్టు నుంచి పిలుపు రాగానే నేను మా తల్లిదండ్రులకు ఫోన్ చేశాను. వారి సంతోషం నన్ను సోషల్ మీడియాను చూసేలా చేసింది. మా అమ్మకు ఆట గురించి పెద్దగా తెలియదు. కానీ టీమిండియా అంటే తెలుసు.
ఆమె క్రికెట్ పెద్దగా చూడదు. నేను ఔటైతే చాలా బాధపడుతుంది. ఆమె నేను ఎన్ని పరుగులు చేసాను.. ఎన్ని క్యాచ్‌లు తీసుకున్నాను అనేది మాత్రమే తెలుసుకుంటుంది.'అని ధ్రువ్ జురెల్ చెప్పుకొచ్చాడు.