న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎవరో కూడా తనకు తెలియదని అతని సతీమణి ధనశ్రీ వర్మ తెలిపింది. చాలా రోజుల వరకు అందరిలా అతన్ని డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన ఓ స్టూడెంట్‌లానే చూశానని చెప్పింది. క్రికెట్ చూడటం మానేయడంతో చాహల్ ఎవరో తనకు తెలియలేదని పేర్కొంది.
ఇక చాహల్, ధనశ్రీ వర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీమిండియా ఆటగాళ్ల ప్రయివేట్ ఫంక్షన్లకు ధనశ్రీ వర్మ చాహల్‌తో కాకుండా శ్రేయస్ అయ్యర్‌తో హాజరవ్వడం, అతనితో క్లోజ్‌గా ఉండటంతో ఈ పుకార్లు వెలువడ్డాయి.

అయ్యర్, ధనశ్రీ వర్మ మధ్య అఫైర్ ఉందనే వార్తలు షికారు చేశాయి. అయితే వీటిని చాహల్-ధనశ్రీ వర్మలు ఖండించారు. తమ వైవాహిక జీవితం సాఫిగా సాగుతుందని తెలిపారు. తాజాగా ఓ చాట్‌షోలో సతీ సమేతంగా పాల్గొన్న ఈ సెలెబ్రిటీ జోడీ.. తమ పరిచయం ప్రేమగా ఎలా మారిందో చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక డ్యాన్స్ నేర్చుకునేందుకు ధనశ్రీ వర్మను ఆశ్రయించానని చాహల్ తెలిపాడు.
'ధనశ్రీ వర్మ చేసిన టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చూశాను. లాక్‌డౌన్‌లో ఏం చేయాలో తెలియక ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకోవాలని అడిగాను. వెంటనే ఆమె ఆన్‌లైన్ క్లాస్‌లు మొదలుపెట్టింది. మొదటి రెండు నెలలు మా మధ్య డ్యాన్స్ గురించి తప్ప మరే విషయాలు చర్చకు రాలేదు. ఎప్పుడూ కూడా నేను ఆమెను ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నించలేదు.
మా మధ్య అంత స్నేహం కూడా లేదు. కేవలం డ్యాన్స్ నేర్చుకోవడంపైనే సీరియస్‌గా ఫోకస్ పెట్టాను. లాక్‌డౌన్ వంటి కఠిన సమయంలోనూ ఆమె సంతోషంగా ఉంటం నాకు బాగా నచ్చింది. అందుబాటులో ఉండేవాటితోనే ఆనందంగా గడపడం ఆకట్టుకుంది. అదే విషయం గురించి ఆమెను అడిగా. అప్పటి నుంచి మా మధ్య ఇతర విషయాలు చర్చకు వచ్చాయి.
ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకోవడం ప్రారంభించాం. ఆమె ఎవరి సాయం లేకుండా ఈ స్థాయికి చేరింది. ధనశ్రీకి ప్రపోజ్ చేసే ముందు మా అమ్మకు తనంటే ఇష్టమని చెప్పాను. ఆ తర్వాత ధనశ్రీని పెళ్లి చేసుకుందామా? అని డైరెక్ట్‌గా అడిగాను.'అని చాహల్ చెప్పుకొచ్చాడు.
మొదట్లో తనకు చాహల్ ఓ క్రికెటర్ అనే విషయం తెలియదని ధన శ్రీ వర్మ చెప్పుకొచ్చింది. 'నేను క్రికెట్ చూస్తుండేదాన్ని. కానీ చాహల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి క్రికెట్ చూడటం మానేశాను. అందుకే మా ఇద్దరి మధ్య పరిచయం పెళ్లికి దారి తీసింది. డ్యాన్స్ క్లాస్‌ల కోసం చాహల్ సంప్రదించినప్పుడు అతను ఎవరో కూడా నాకు తెలియదు.
డ్యాన్స్ నేర్చుకునే సమయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. కమిట్‌మెంట్‌తో నేర్చుకున్నాడు. హోమ్ వర్క్ ఇచ్చినా శ్రద్దగా చేసేవాడు. నేరుగా పెళ్లి చేసుకుంటానని అడగడంతో పడిపోయాను. ఇప్పుడున్న తరంలో ఎవ్వరూ అలా అడగరు. పెళ్లి గురించి అతను ఎలాంటి ఒత్తిడి చేయలేదు. మా జీవితం చాలా చక్కగా సాగుతోంది. అందరూ అనుకుంటున్నట్టు ఎలాంటి సమస్యలు లేవు.' ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.