సౌతాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో టీ20లో 41 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా డెవాల్డ్ బ్రెవిస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించాడు. గప్టిల్ ఆస్ట్రేలియాపై 49 బంతుల్లోనే శతకం సాధించాడు.
సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో డెవాల్డ్ బ్రెవిస్ రెండో స్థానంలో నిలిచాడు. అతనికి కన్నా ముందు డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై అతను 35 బంతుల్లోనే శతకం సాధించాడు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ తర్వాత క్వింటన్ డికాక్(43 బంతుల్లో), రిచర్డ్ లెవెల్(45 బంతుల్లో), ఫాఫ్ డుప్లెసిస్(46 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ బాదిన సౌతాఫ్రికా యంగెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. అతను 22 ఏళ్ల 105 రోజుల వయసులో ఈ రికార్డ్ సాధించాడు. బ్రెవిస్ కన్నా ముందు రిచర్డ్ లెవి 24 ఏళ్ల 36 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. 2012లో న్యూజిలాండ్‌పై అతను శతకం సాధించాడు.

జూనియర్ ఏబీడీగా అభిమానుల ప్రేమను పొందిన డెవాల్డ్ బ్రెవిస్.. 56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్(22 బంతుల్లో 3 ఫోర్లతో 31) మాత్రమే రాణించాడు. ఆస్ట్రేలియా బౌలరర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(2/44), బెన్ ద్వార్షుయిస్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా చెరో వికెట్ పడగొట్టారు.