Devon Conway ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలనుంది!

న్యూఢిల్లీ: డెవాన్ కాన్వే.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. అరంగేట్ర టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో దుమ్మురేపిన ఈ న్యూజిలాండ్ యువక్రికెటర్ నిలకడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో సూపర్ బ్యాటింగ్‌తో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికా సంతతికి చెందిన డెవాన్ కాన్వే.. ఆ దేశం తరఫున డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాడు. ఏమైందో ఏమో కానీ 2017లో సౌతాఫ్రికాను వదిలి న్యూజిలాండ్‌కు వచ్చాడు.
అక్కడ క్లబ్ స్థాయి క్రికెట్ ఆడుతూ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సమాయాత్తం అవుతున్నాడు. అయితే డెవాన్ కాన్వే ఐపీఎల్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉందని అతని వ్యక్తిగత కోచ్ గ్లేన్ పొక్ నాల్ తెలిపాడు.

రోహిత్‌తో కలిసి ఆడితే..
తాజాగా క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న డెవాన్ కాన్వేకు ఐపీఎల్ కాంట్రాక్టు దక్కుతుందని భావిస్తున్నారా? ఏ జట్టు అయితే బాగుంటుందనుకుంటున్నారన్న ప్రశ్నకు పోక్‌నాల్ బదులిచ్చాడు. 'వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ డెవాన్ కాన్వేపై ఓ కన్నేసాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్‌గా, మిడిలార్డ్ బ్యాట్స్‌మన్‌గా అవసరమైతే వికెట్ కీపర్‌గా రాణించగలిగే సత్తా ఉన్న డెవాన్ కాన్వే కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయి. అయితే ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తే చూడాలని నాకుంది'అని పోక్‌నాల్ పేర్కొన్నాడు.

అన్ సోల్డ్ ప్లేయర్‌గా..
ఇక ఐపీఎల్ 2021 సీజన్ నేపథ్యంలో జరిగిన మినీ వేలంలో డెవాన్ కాన్వే రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో పాల్గొన్న ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తికనబర్చలేదు. దాంతో అతను అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. అయితే ఇంగ్లండ్‌పై, టీ20 క్రికెట్‌లో అతను ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌లు ఐపీఎల్ వేలానికి ముందే ఆడుంటే అతనికి కచ్చితంగా అవకాశం దక్కేదా అన్న ప్రశ్నకు పోక్‌నాల్ అవుననే సమాధానమిచ్చాడు. 'ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై కాన్వే అదరగొట్టాడు. ఈ సిరీస్‌లు ముందే జరుగుంటే కచ్చితంగా కాన్వేకు అవకాశం దక్కేది. అయితే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కచ్చితంగా అతనికి అవకాశం దక్కుతుంది. ఐపీఎల్‌లో ఆడే టైమ్ వస్తుంది'అని పొక్ నిల్ స్పష్టం చేశాడు.

డబ్ల్యూటీసీలో చెలరేగుతాడు..
గతంలో ఎప్పుడూ భారత బౌలింగ్ ఆడిన అనుభవం లేని డెవాన్ కాన్వే డబ్ల్యూటీసీ ఫైనల్లో తన ఫామ్‌ను కొనసాగిస్తాడా? లేక ఇబ్బంది పడతాడా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం ఉండదని పొక్ నిల్ స్పష్టం చేశాడు. 'అతని ఆటలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నా. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అతను ప్రణాళికలను మొదలుపెట్టి ఉంటాడు. తమ బౌలర్లతో ప్రాక్టీస్ చేస్తూ తన అస్త్రాలను సిద్దం చేసుకుంటాడు. అద్భుతమైన ప్రదర్శనల తర్వాత అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. అదే ఉత్సాహంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి అతను చెలరేగుతుడానుకుంటున్నా'అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications