
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెంట్రుక వాసి తేడాతో బచాయించాడు. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని నసీమ్ షా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా వేయగా.. కాన్వే డ్రాప్ షాట్‌తో క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి వికెట్ల వైపు దూసుకెళ్లింది.
వెంట్రుక వాసి తేడాతో వికెట్లకు తగలకుండా వెనక్కు వెళ్లింది. బంతిని కాన్వే ఆపే ప్రయత్నం చేసినా ఔటయ్యేవాడు. మొత్తానికి అతనికి లక్ ఫేవర్ చేయడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను 5 పరుగులు మాత్రమే చేశాడు.
కాన్వే గనుక ఔటై ఉంటే న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడేది. ఎందుకంటే షాహిన్ షా వేసిన తొలి ఓవర్‌లోనే డేంజరస్ ఫిన్ అలెన్(4) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలిమ్సన్‌తో కలిసి డేవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది.
ఇప్పటికే ఉపయోగించిన పిచ్ కావడంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. నాకౌట్ సమరంలో ఒత్తిడి కూడా ఉంటుందని, పాకిస్థాన్ చేజింగ్‌లో తడబడుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. పిచ్‌పై గ్రాస్ లేని కారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. ప్రత్యర్థి జట్టులో కొంత మంది తెలియని వారున్నారని, అయినా తమ ప్రణాళికలకు కట్టుబడి రాణిస్తే విజయం సాధించవచ్చని చెప్పాడు. గేమ్‌పైనే తమ ఫోకస్ ఉందని, తమ సాయశక్తుల విజయం కోసం పోరాడుతామని తెలిపాడు.