దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జట్టులోని 11 మందికి 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. ఈ అరుదైన ఘటనకు మణిపూర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ వేదికైంది. శుక్రవారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లంతా బౌలింగ్ చేశారు. వికెట్ కీపర్ అనూజ్ రావత్ సైతం ఒక ఓవర్ బౌలింగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది.
క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘటనగా నిలిచిపోయింది. జట్టులోని 10 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేయడమే గొప్ప అంటే.. వికెట్ కీపర్ కూడా బౌలింగ్ చేయడం చాలా అరుదు. క్రికెట్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా 9 మంది మాత్రమే బౌలింగ్ చేశారు. తాజా మ్యాచ్‌తో ఢిల్లీ రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఆ జట్టు బౌలింగ్‌కు సంబంధించిన స్కోర్ బోర్డు నెట్టింట వైరల్‌గా మారింది.

ఢిల్లీ బౌలర్లు ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, ఆయుష్ బదోని రెండేసి ఓవర్లు బౌలింగ్ చేయగా.. హర్ష్ త్యాగీ, దిగ్వేష్, మయాంక్ రావత్ మూడేసి ఓవర్లు బౌలింగ్ చేశారు. ఆర్యన్ రానా, హిమ్మంత్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, యశ్ దుల్‌తో పాటు వికెట్ కీపర్ అనూజ్ రావత్ కూడా ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్‌ల్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మణిపూర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు చేసింది. అహ్మద్ షా(32), రెక్స్ రాజ్‌కుమార్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో హర్ష్ త్యాగీ, దిగ్వేష్ రతి రెండేసి వికెట్లు తీయగా.. ఆయుష్ సింగ్, ఆయుష్ బదోని, ప్రియాన్ష్ ఆర్య తలో వికెట్ తీసారు.
అనంతరం ఢిల్లీ 18.3 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది. యశ్ ధుల్(51 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
All 11 players bowled in a single match for Delhi in this Syed Mushtaq Ali Trophy. 🤯
— Tanuj Singh (@ImTanujSingh) November 29, 2024
- One of the Most Rare things in Cricket...!!!! pic.twitter.com/03KoO94Djw