
ఐదారు నెలలుగా ఇంట్లో ఉన్నా
ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కి స్పిన్నర్ హోదాలో సేవలందించబోతున్నాడు. ఐపీఎల్ కోసం భారత్ నుండి దుబాయ్ చేరుకున్న ఢిల్లీ జట్టు అక్కడి ఓ హోటల్లో బస చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బృందం ప్రొటొకాల్స్ ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ అనుభవాలపై యాష్ మాట్లాడుతూ... 'నేను గత ఐదారు నెలలుగా ఇంట్లో ఉన్నాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో స్వంత పని చేసుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అందరితో చాట్ షో నిర్వహించాను. కానీ దుబాయ్‌లోని ఆ ఆరు రోజుల క్వారంటైన్ నా జీవితంలోనే చెత్త సమయంగా భావిస్తున్నా' అని తెలిపాడు.

క్వారంటైన్ చెత్తగా గడిచింది
'మొదటి రోజు నేను హోటల్ గది నుంచి బయటకు చూశా. ఒకవైపు దుబాయ్ సరస్సు అద్భుతంగా ఉంది. మరోవైపు బుర్జ్ ఖలీఫా కనపడింది. ఎంతసేపని ఒకేవద్ద కూర్చుకుని వాటిని చూడగలను. ఇక వాతావరణం చాలా చాలా వేడిగా ఉంది. అందుకే ఆ ఆరు రోజుల క్వారంటైన్ చెత్తగా గడిచింది' అని ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన వీడియోలో రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. సాధారణంగా తాను మొబైల్ ఫోన్‌ను చూడనని, రెండు గంటలు చూస్తే ఎక్కువేనని యాష్ తెలిపాడు. అయితే క్వారంటైన్ సమయంలో మాత్రం ఆరు గంటలు చూడాల్సి వచ్చేదని చెప్పాడు. పుస్తకాలను కూడా చదవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

మైదానంలో ప్రాక్టీస్
ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో క్వారంటైన్ పూర్తవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లన్నీ ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సమక్షంలో ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్ల నెట్స్ సెషన్‌ను పాంటింగ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్ బృందంతో సమావేశమైన రికీ ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తదితరలు నెట్స్‌లో చెమటోడ్చారు.

మన్కడింగ్‌తో విమర్శలు
ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఆడిన ఆర్ అశ్విన్.. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే.. బట్లర్ క్రీజు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఇది గమనించిన అశ్విన్ బౌలింగ్‌ని నిలిపివేసి.. బెయిల్స్‌ని పడగొట్టాడు. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. దాంతో అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ ఆ సీజన్ మొత్తం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాను మాత్రం క్రికెట్ రూల్స్ ప్రకారమే ఆడానని బదులిచ్చాడు.
CPL 2020: వర్షంతో మ్యాచ్ రద్దు.. సెమీస్ రేసునుంచి సెయింట్ కిట్స్ ఔట్!!


Click it and Unblock the Notifications












