
హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్ అలియాస్ ఢిల్లీ డేర్ డేవిల్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ యూనిక్ రికార్డు నెలకొల్పింది. 13 ఏళ్ల ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే మరే జట్టుకు సాధ్యంకాని గణంకాన్ని నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన కీలకపోరులో ఢిల్లీ 6 వికెట్లతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఈ సీజన్‌లో టాప్-2 ర్యాంక్ అందుకోవడంతో.. పాయింట్స్ టేబుల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా గుర్తింపు పొందింది.
2008 నుంచి 2020 వరకు ఫస్ట్, 6, 8 స్థానాల్లో రెండేసి సార్లు నిలిచింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకోపోయింది. 2009, 2012లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈ సీజన్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక 2019, 2008, 2010లో 3, 4, 5 స్థానాలను కైవసం చేసుకుంది. 2016, 2017లో మాత్రం 6వ స్థానంతో సరిపెట్టుకుంది. 2015లో ఏడో స్థానంలో నిలిచిన ఆ టీమ్.. 2014, 2018లో మాత్రం రెండు సార్లు 8వ స్థానానికి పరిమితమైంది.
2013లో 9వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2011లో 10వ స్థానానికి పరిమితమైంది. ఇక 2011లో కొచ్చి టస్కర్క్, పుణెవారియర్స్ రెండు జట్లు రావడంతో ఆ సీజన్10 జట్లతో జరిగింది. ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ తప్పుకోగా.. 2013 వరకు 9 టీమ్స్‌తో ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ పేరుతో బరిలోకి దిగిన ఆ జట్టు ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకుంది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' నోర్జే 3 వికెట్లు తీయగా...రబడా ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి.
తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్య రహానే (60: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్) మెరుపు అర్ధ శతకాలతో రాణించారు. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ రన్‌రేట్ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.