టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హై కోర్టులో పరువు నష్టం దావా దాఖలు అయ్యింది. ధోనీ మాజీ బిజినెస్ పార్ట్‌నర్స్ మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ధోనీ.. పరువుకు భంగం కలిగించాడని మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు.
ధోనీతో పాటు తమకు వ్యతిరేకంగా పోస్ట్‌లను అనుమతించిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఎక్స్, గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్‌లతో పాటు అసత్య కథనాలను పబ్లీష్ చేసిన న్యూస్ ఫ్లాట్‌ఫామ్స్‌పై కూడా పరువు నష్టం దావా వేసారు.

ఇక మిహిర్ దివాకర్, సౌమ్యా, ధోనీలు భాగస్వామ్యులుగా ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెట్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. 2017లో సదరు సంస్థ ధోనీతో ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అర్కా స్పోర్ట్స్.. ఫ్రాంచైజీ ఫీజులు, లాభాల్లో వాటాను క్రికెటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో సదరు కంపెనీ విఫలమైంది.
ఈ విషయంపై తన భాగస్వాములతో ధోనీ చర్చించినా ఫలితం లేకపోయింది. దాంతో అతను ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత పలుమార్లు లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ తాజాగా కోర్టును ఆశ్రయించారు.
రాంచీ కోర్టులో దివాకర్, సౌమ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ చేసి మోసం కారణంగా ధోనీకి రూ. 15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ధోనీ తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఒప్పందం రద్దు చేసుకున్నా.. దేశవ్యాప్తంగా తన పేరిట క్రికెట్ అకాడమీలను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. అయితే ఇదంతా అసత్య ప్రచారమని దివాకర్, సౌమ్యలు పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో తమ పరువుకు భంగం కలిగిందని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
నూతన సంవత్సర వేడుకలను దుబాయ్‌లో జరుపుకున్న ధోనీ ఇటీవల భారత్‌కు తిరిగొచ్చాడు. ధోనీతో పాటు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా న్యూ ఇయర్ పార్టీలో కనిపించాడు. డిసెంబర్ 19న ముగిసిన ఐపీఎల్ వేలంలోనూ మహీ, పంత్ ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరూ టెన్నిస్ ఆడిన వీడియోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్ల ప్రారంభానికి ముందు ధోనీ గురించే ఓ వార్త ఎప్పుడూ చక్కర్లు కొడుతుంటుంది. ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కథనాలు వస్తాయి. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఇటీవల స్పందిస్తూ.. ''ఆ విషయం మాకు తెలియదు. దాని గురించి ధోనీ మాకు కూడా ఏదీ చెప్పడు. అతడే దీనికి సమాధానం ఇవ్వగలడు'' అని అన్నాడు. కాగా, 42 ఏళ్ల ధోనీ ఈ ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. మరో కొన్ని రోజుల్లో ధోనీ నెట్స్‌లో సాధన మొదలుపెట్టనున్నాడు.