ఇంగ్లండ్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బుధవారం సౌథాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీప్తి శర్మ(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 258 పరుగులు చేసింది. సోఫియా డంక్లీ(92 బంతుల్లో 9 ఫోర్లతో 83) శతకం చేజార్చుకోగా.. అలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(73 బంతుల్లో 2 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించింది. ఎమ్మాలాంబ్(50 బంతుల్లో 4 ఫోర్లతో 39) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్(2/55), స్నేహ్ రాణా(2/31) రెండేసి వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్, తెలుగు తేజం శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులు చేసి గెలుపొందింది. దీప్తి శర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్(54 బంతుల్లో 5 ఫోర్లతో 48), ప్రతికా రావల్(51 బంతుల్లో 3 ఫోర్లతో 36), హర్లీన్ డియోల్(44 బంతుల్లో 4 ఫోర్లతో 27) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫి ఎక్లెస్టోన్, లారెన్ ఫిలర్ తలో వికెట్ తీయగా.. చార్లీ డీన్ రెండు వికెట్లు పడగొట్టింది.

లక్ష్య చేధనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్మృతి మంధాన(28) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగింది. దాంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యమే నమోదైంది. ఆ తర్వాత ప్రతీకా రావల్ ఔటవ్వగా, హర్లీన్ డియోల్ వెనువెంటనే వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(17) తన వైఫల్యాన్ని కొనసాగించింది. దాంతో భారత్ 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జెమీమాతో కలిసి దీప్తి శర్మ జట్టును ఆదుకుంది.
ఈ క్రమంలో దీప్తి శర్మ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. జెమీమా తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రిచా ఘోష్(10) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. భారత విజయానికి చివరి 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి రాగా.. అమన్‌జోత్ కౌర్(14 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడి భారత విజయాన్ని లాంఛనం చేసింది. వరుసగా రెండు బౌండరీలు బాది విజయాన్ని అందించింది.