
అహ్మదాబాద్: మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ లేదా మహేద్ర సింగ్ ధోనీ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకోవాలనేది తన చిన్నప్పటి కలని యువ ఆల్‌రౌండర్ దీపక్ హుడా అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దీపక్ హుడా.. తొలి వన్డేకు ముందు విరాట్ కోహ్లీ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఈ అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్న దీపక్ హుడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తొలి వన్డేలో 26 పరుగులతో అజేయంగా నిలిచిన దీపక్ హుడా.. రెండో వన్డేలో ధనాధన్ బ్యాటింగ్‌తో 29 రన్స్ చేశాడు. ఓ వికెట్ కూడా పడగొట్టాడు.
రెండో వన్డే అనంతరం సహచర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి బీసీసీఐ టీవీతో చిట్ చాట్ చేసిన దీపక్ హుడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వెస్టిండీస్‌పై తొలివన్డేతో అరంగేట్రం చేయడం చాలా అద్భుతమైన ఫీలింగ్. ఈ జట్టులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ధోనీ లేదా కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకోవాలనేది నా చిన్నప్పటి కోరిక. తొలి వన్డే కోసం ఎంపికై, కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవడం నాకు అద్భుతమైన అనుభూతి. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ లాంటి వాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఆటపై దృష్టిపెట్టి బాగా కష్టపడతాను" అని దీపక్ హుడా.. సూర్యకుమార్ యాదవ్‌తో చెప్పాడు.
ఇక తొలి వన్డే అనంతరం తన అరంగేట్రంపై సంతోషం వ్యక్తం చేసిన దీపక్ హుడా ట్విటర్ వేదికగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు తెలియజేశాడు. 'నా దేశం తరఫున ఆడే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడంతో నా కల సాకారమైంది. నా ప్రయాణంలో వెనుకుండి నడిపించిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు.'అని ట్వీట్ చేశాడు.
బుధవారం జరిగిన రెండో వన్డే 44 రన్స్ తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. శక్రవారం చివరి వన్డే జరుగుతుంది.