
మహీ రీ ఎంట్రీ కష్టమే..
ఇక జార్ఖండ్ డైనమైట్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి నుంచి మైదానానికి దూరంగా ఉన్నాడు. ఎలాంటి క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పాయాడు. దీంతో ధోనీ భవితవ్యంపై అనేక వార్తలు వినిపించాయి. అయితే ఐపీఎల్‌తో ధోనీ రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. మహీ కూడా ఈ సీజన్ ఐపీఎల్ కోసం సిద్దమయ్యాడు.
లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. కానీ కరోనా కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటంతో అతని రీ ఎంట్రీ ఆలస్యమైంది. దీంతో మహీ మరోసారి బ్లూ జెర్సీ వేసుకోవడం కష్టమేనని వెటరన్ క్రికెటర్లు, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, ఆకాష్ చోప్రాలు వ్యాఖ్యానించారు.

ధోనీ రీఎంట్రీ పక్కా..
కానీ చెన్నై ఆటగాళ్లు మాత్రం ధోనీ ఇంకొన్ని రోజులు ఆడుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న సీఎస్‌కే పేసర్ దీపక్ చాహర్ కూడా ధోనీ రీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘నేను ధోనీకి పెద్ద అభిమానిని. అతను మరోసారి భారత్‌కు ఆడాలని కోరుకుంటున్నా. మరోసారి మహీతో భారత్ తరఫున ఆడాలని ఉంది. లక్కీగా అతని సారథ్యంలోనే అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాను. అప్పటికే ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఊహించని విధంగా నా అరంగేట్ర మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించాడు. క్రికెట్ ఆడాలా? వద్దా అనేది అతని నిర్ణయం. కానీ ధోనీ ఫిట్‌నెస్ లెవల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
అతను ఆడాలనుకుంటే ఇప్పుడైనా ఆడగలడు. ఆ సత్తా అతనిలో ఉంది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే.. అతను అద్భుత ప్రదర్శన కనబర్చి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడు. అతని అభిమానిగా ధోనీ మరోసారి బ్లూ జెర్సీ ధరించాలని కోరుకుంటున్నా. అలాగే అతను ఆడే చివరి మ్యాచ్‌లో కూడా భాగం కావాలనుకుంటున్నా'అని చాహర్ చెప్పుకొచ్చాడు.

ఆసియాకప్‌తో అరంగేట్రం..
ఆసియాకప్-2018తో దీపక్ చాహర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయగా.. ఆ టోర్నీలో జట్టును నడిపించిన రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్‌లకు అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
అప్పటికే సెమీస్ చేరడంతో పాటు.. అఫ్గానిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్ కావడంతో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించింది. దీంతో అనూహ్యంగా ధోనీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టి 200 వన్డేల కెప్టెన్సీ రికార్డు అందుకున్నాడు.

ధోనీ చెక్కిన శిల్పం..
ఐపీఎల్‌లో పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడినప్పుడే చాహర్‌లోని స్పార్క్ చూసిన ధోనీ.. 2018 సీజన్‌లో చెన్నైసూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నాడు. అతని బౌలింగ్‌ను మరింత మెరుగుదిద్దాడు. కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్ చేసే దీపక్‌తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయిస్తూ స్పెషలిస్ట్‌గా నిలబెట్టాడు. పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్ చేయాలో.. వైడ్ యార్కర్లు, స్లోయర్లు వేయడం ధోనీ పర్యవేక్షణలోనే దీపక్ నేర్చుకున్నాడు. 2018లో 10 వికెట్లతో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్.. 2019లో 22 వికెట్లు పడగొట్టి భారత జట్టులోకి చోటు దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications
