
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చహర్ సతీమణి జయా భరద్వాజ్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలను తిరిగి ఇవ్వమన్నందుకు నిందితులు చంపేస్తామని బెదిరించారని చాహర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయా భరద్వాజ్‌కు తెలిసిన రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేష్ పరేక్‌లు వ్యాపార విస్తరణ కోసం ఆమె దగ్గర రూ. 10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 7న ఆన్‌లైన్ వేదికగా జయ భరద్వాజ్.. ధ్రువ్ పరేక్, కమలేష్ పరేక్‌లకు డబ్బులు పంపించారు.
ఆ డబ్బులను వ్యాపారం కోసం ఉపయోగించకుండా తండ్రీ కొడుకులు దుబార చేశారని తెలుసుకున్న జయా భరద్వాజ.. తన డబ్బులు ఇవ్వాలని అడిగింది. ముందు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన తండ్రీ కొడుకులు.. ఒత్తిడి చేయడంతో బెదిరింపులకు దిగారు. దుర్భాషలాడటమే కాకుండా చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ విషయాన్ని జయా.. తన భర్తతో పాటు మామకు కూడా చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆగ్రాలోని హరి పర్వత్ పోలీస్ స్టేషన్‌లో దీపక్ చాహర్ తండ్రి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
ఇక నిందితుల్లో ఒకరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తో సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో హెచ్‌సీఏలో అధికారిగా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారని అక్కడి స్థానిక మీడియో పేర్కొంది. ఈ మోసంలో ధ్రువ్, కమలేష్ మాత్రమే ఉన్నారా? మరెవరైనా భాగమయ్యారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా ఓ మ్యాచ్ అనంతరం జయా భరద్వాజ్‌ను ప్రపోజ్ చేసిన దీపక్ చాహర్.. గతేడాది వివాహం చేసుకున్నాడు.
ఐపీఎల్‌కు ముందు వెన్ను గాయంతో భారత జట్టుతో పాటు గత సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహర్.. టీ20 ప్రపంచకప్ ముందు రీఎంట్రీ ఇచ్చి మళ్లీ గాయపడ్డాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌తో అతను రీఎంట్రీ ఇవ్వనున్నాడు.