IND vs SL:దీపక్ చాహర్ అజేయ హాఫ్ సెంచరీ.. గబ్బర్ సేన అద్భుత విజయం!

కొలంబో: దీపక్ చాహర్ (82 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 69 నాటౌట్) అసాధారణ పోరాటంతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో దీపక్ చాహర్ అద్భుతం చేయడంతో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక శ్రీలంకపై భారత్‌కు ఇది వరుసగా 10వ సిరీస్ విజయం.
భువనేశ్వర్ కుమార్(19 నాటౌట్)తో కలిసి చాహర్ 8వ వికెట్‌కు అజేయంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేసింది. అవిష్కా ఫెర్నాండో(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), చరిత్ అసలంక(68 బంతుల్లో 6 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో చమిక కరుణరత్నే(33 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/50), భువనేశ్వర్ కుమార్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. , దీపక్ చాహర్ (2/53) రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం చేజింగ్‌కు దిగిన భారత్ చాహర్ ధాటికి 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(44 బంతుల్లో 6 ఫోర్లతో 53), మనీశ్ పాండే(31 బంతుల్లో 3 ఫోర్లతో 37), కృనాల్ పాండ్యా(54 బంతుల్లో 3 ఫోర్లతో 35) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీయగా.. డసన్ షనక, సందకన్, కాసున్ రజితా తలో వికెట్ తీశారు.

షా, ఇషాన్ విఫలం..
అంతకుముందు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(13), వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపరిచారు. పృథ్వీ షాను హసరంగా .. ఇషాన్ కిషన్‌ను రజితా క్లీన్ బౌల్డ్ చేశారు. దాంతో 39 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(37)తో కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డిసిల్వా విడదీశాడు.

పాండే రనౌట్..
జోరుమీదున్న ధావన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 65 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రాగా.. మనీష్ పాండే ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. కానీ మనీష్ పాండే రనౌటవ్వడంతో 5వ వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

సూర్య సూపర్ ఫిఫ్టీ
కృనాల్‌తో సూర్య పోరాడాడు. సందకన వేసిన 27 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన సూర్య.. కెరీర్‌లో ఫస్ట్ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన అతను ఆ బంతిని డిఫెన్సివ్ చేయబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

చాహర్ సూపర్ నాక్..
ఆ తర్వాత భువీ బదులు దీపక్ చాహర్‌ను పంపించిన టీమ్‌మేనేజ్‌మెంట్ అద్భుత ఫలితాన్ని రాబట్టింది. ఓవైపు కృనాల్ ఔటైనా దీపక్ చాహర్ అద్భుతంగా పోరాడాడు. బ్యాట్స్‌మెన్ తరహాలో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ బాది అద్భుత విజయాన్నందించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ కచ్చితంగా నిలిచిపోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications