వన్డే ప్రపంచకప్ ముందు రోహిత్, కోహ్లీకి అది సవాలే: దీప్ దాస్‌గుప్తా
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకే ఫార్మాట్‌లో ఆడటం సవాల్‌తో కూడుకున్న విషయమేనని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా అన్నాడు. ఒకే ఫార్మాట్ ఆడుతుండటం వల్ల ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన పరిస్థితి వారికి ఏర్పడిందని అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. దాంతో ప్రతీ వన్డే మ్యాచ్ తర్వాత వీరి ప్రదర్శనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా.. వారికి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమయం లేదు మిత్రమా..
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 144 పరుగులు చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. అయితే తొలి రెండు వన్డేల్లో రోహిత్ విఫలమవ్వడంతో రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ రోహిత్ లార్డ్స్ వన్డేలో సెంచరీతో చెలరేగి ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
తాజాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన దీప్ దాస్‌గుప్తా.. ఈ ఇద్దరూ ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందేనన్నాడు. ఫామ్‌లోకి రావడానికి ఒక్క గేమ్ కూడా వృథా చేయవద్దని హెచ్చరించాడు. 'రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రతీ సిరీస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలి. సుదీర్ఘ విరామం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగినప్పుడు తిరిగి ఫామ్ అందుకోవడానికి ఒకటి, రెండు మ్యాచ్‌లు వృథా చేయవద్దు.
ఆ చర్చే అనవసరం..
కోచ్‌లు, సహాయక సిబ్బంది కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడి తొలి మ్యాచ్ నుంచే అత్యుత్తమంగా రాణించే పరిస్థితులను కల్పించాలి. అవసరమైతే ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడించాలి. జట్టులో వారి స్థానం గురించి చర్చే అనవసరం. వారి అనుభవం, ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ జట్టులో చోటు ఇవ్వాల్సిందే.
ఒకే ఫార్మాట్‌లో కొనసాగుతుండటం విరాట్, రోహిత్‌కు సవాల్‌తో కూడుకున్న విషయమే. ఎందుకంటే పలు ఫార్మాట్లు ఆడినప్పుడు.. ఒక మ్యాచ్‌లో విఫలమైనా.. మరో మ్యాచ్‌లో పరుగులు చేస్తే ఆ వైఫల్యాన్ని మరిచిపోయేలా చేస్తుంది. కానీ వారు ఒకే ఫార్మాట్ ఆడుతుండటంతో ప్రతీ మ్యాచ్ వైఫల్యాన్ని అభిమానులు గుర్తుంచుకుంటారు.'అని దీప్ దాస్‌గుప్తా చెప్పుకొచ్చాడు. భారత్ తమ తదుపరి వన్డే సిరీస్‌ను సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది. అప్పటి వరకు కోహ్లీ, రోహిత్‌లు ఇంటికే పరిమితం కానున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

