గాయపడ్డ డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేయడం చాలా సులువు.. ఆ బంతులేస్తే చాలు: మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: గజ్జ గాయంతో ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకోకముందే ఆడించే ప్రయత్నం చేస్తన్నారని టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా తెలిపాడు. ఇది ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో టాపార్డర్ బ్యాటింగ్ బలహీనతను అధిగమించడానికి ఆసీస్ పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే సగం ఫిట్‌గా ఉన్న వార్నర్‌ను ఔట్ చేయడం భారత బౌలర్లకు చాలా సులువని చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో ఆడుతాడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

భారత్‌కు కలిసొచ్చే అంశం..
ఈ నేపథ్యంలో ఇండియా టుడేతో మాట్లాడిన దీప్‌దాస్ గుప్తా వార్నర్ గాయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘డేవిడ్ వార్నర్ ఆసీస్ జట్టులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఎందుకంటే ఆ జట్టు టాపార్డర్ బలహీనతను అధిగమించడానికి పడుతున్న ఇబ్బందిని తెలియజేస్తుంది. వార్నర్ కూడా తాను మోకాలిని వంచలేనని పేర్కొన్నాడు. ఇక గజ్జ గాయం ఉన్నప్పుడు ఫ్రంట్ ఫుట్‌ను వేగంగా కదపడం చాలా కష్టం. వార్నర్‌కు ఉన్న ఈ సమస్య భారత్ బౌలర్లకు లాభం చేకూరుస్తుంది. అతన్ని ఔట్ చేయడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే గజ్జ గాయం కారణంగా వార్నర్ కొన్ని మూవ్‌మెంట్స్ ఇవ్వలేడు.'అని దీప్‌దాస్ గుప్తా పేర్కొన్నాడు.

ముందుకొచ్చి ఆడేలా చేయాలి..
ఇక డేవిడ్ వార్నర్ బలహీనతను టార్గెట్ చేస్తూ అతనికి బంతులేయాలని భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సూచించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అతను ముందుకు వచ్చి ఆడేలా చేయాలన్నాడు. ‘డేవిడ్ వార్నర్ ముందుకు వచ్చి కాళ్లు చాపి ఆడేలా బంతులు వేయాలి. పదేపదే అవే తరహా బంతులతో అతని బలహీనతను టార్గెట్ చేయాలి. ముఖ్యంగా గాయంతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు ఈ వ్యూహం పనిచేస్తుంది. ఒకవేళ వార్నర్ ఫిట్‌గా లేకుంటే అతను చేయాల్సిన మొదటి పని భారత సీమర్ల స్వింగ్ నుంచి బయటపడటం. ఆ తర్వాత స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కోవడం.'అని ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు.

రెండో వన్డేలో గాయం..
గతేడాది నవంబర్‌లో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గజ్జ గాయానికి గురైన విషయం తెలిసిందే. గాయం తీవ్రత కారణంగా అతను మూడు టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. వార్నర్ గైర్హాజరీలో వచ్చిన ఓపెనర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడం ఆసీస్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా టెస్ట్ సిరీస్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన జోబర్న్స్ ఒక హాఫ్ సెంచరీ మినహా చేసిందేం లేదు. దాంతో అతనిపై వేటు వేసిన ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్.. వార్నర్‌తో పాటు విల్ పుకోవిస్కీని జట్టులోకి తీసుకుంది. మరి గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఏమేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications