
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53)లకు తోడుగా కేన్ విలియమ్సన్(25 బంతుల్లో 5 ఫోర్లు 41), అబ్దుల్ సమాద్ (7 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్‌తో 12 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా(2/21), అమిత్ మిశ్రా(2/35) రెండేసి వికెట్లు తీశారు. నెమ్మదైన పిచ్‌పై సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగితే విజయం దక్కుతుంది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో శుభారంభం అందించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు రాబట్టారు. దాంతో హైదరాబాద్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 36 రన్స్ చేసింది. ఆ తర్వాత అమిత్ మిశ్రా వేసిన ఏడో ఓవర్‌లో వార్నర్ భారీ సిక్సర్‌తో 14 పరుగులు పిండుకున్నాడు.
ఇక ఇషాంత్ శర్మ వేసిన 9వ ఓవర్‌లో వార్నర్ మరో సిక్సర్ కొట్టడంతో మళ్లీ 14 రన్స్ వచ్చాయి. అయితే అదే జోరులో మిశ్రా వేసిన 10వ ఓవర్ తొలి బంతిని ఫోర్ కొట్టిన వార్నర్.. రెండో బంతిని డాట్ చేసి మూడో బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో కీపర్‌కు చిక్కాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఢిల్లీ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది.
క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(3).. మిశ్రా వేసిన మరుసటి ఓవర్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో విలియమ్సన్‌తో బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బౌండరీలు రాకున్నా సింగిల్స్‌తో రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నారు. ఇక నోర్జ్ వేసిన 16వ ఓవర్‌లో విలియమ్సన్ వరుస ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు.
అనంతరం స్టోయినిస్ వేసిన 17వ ఓవర్‌లో కూడా విలియమ్సన్ మరోసారి బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టడంతో 12 రన్స్ వచ్చాయి. రబడా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసిన బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది రెండో హాఫ్ సెంచరీ. ఈ ఓవర్‌లోనే ఓ భారీ షాట్‌కు ప్రయత్నించిన బెయిర్ స్టో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ అద్భుత షాట్లతో అలరించాడు. నోర్జ్ వేసిన 19వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. అయితే రబడా వేసిన ఆఖరి ఓవర్‌లో విలియమ్సన్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడంతో నాలుగు రన్స్ మాత్రమే వచ్చాయి. ఆఖరి బంతికి రెండు రన్స్ తీయగా.. షార్ట్ రన్ కావడంతో హైదరాబాద్ 162 పరుగులకే పరిమితమైంది.