డ్యూ ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. పిచ్ కండిషన్స్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని ఒప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రిషభ్ పంత్.. టాస్ గెలిచి ఛేజింగ్ తీసుకోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.'డ్యూ వస్తుందనే ఆలోచనతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా. కానీ డ్యూ ఏ మాత్రం రాలేదు. అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 220-230 పరుగులకు కట్టడి చేసే అవకాశం ఉండే. కానీ పవర్ ప్లేలో సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఈ పవర్ ప్లేనే మా ఓటమిని శాసించింది. వారు ఏకంగా 125 పరుగులు చేశారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన క్యాచ్‌లతో కట్టడి చేశాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతి ఆగుతూ వచ్చింది. మేం ఊహించినదాని కంటే ఎక్కువగా పిచ్ స్లో అయ్యింది. 260, 270 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాలంటే ధాటిగా ఆడాలి.
ముందు ముందు టోర్నీలో మేం మరింత క్లారిటీతో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. ఫెజర్ మెక్‌గుర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓ జట్టుగా మేం ఏం కోరుకున్నామో అతను అలాంటి ప్రదర్శనే ఇచ్చాడు. మా తప్పిదాలను సరిచేసుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 46), షెహ్‌బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్ ఫ్రెజర్-మెక్‌గుర్క్(18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65),అభిషేక్ పోరెల్(22 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), రిషభ్ పంత్(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) రాణించినా ఫలితం లేకపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్(4/19) నాలుగు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. మయాంక్ మార్కండే(2/26), నితీష్ కుమార్ రెడ్డి(2/17) రెండేసి వికెట్లు తీసారు. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.