ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. యువ ప్లేయర్ అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మినహా మరే బ్యాటర్ రాణించలేదు.
దాంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(5/35) ఐదు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ(1) ఓ వికెట్ దక్కింది.

కొంపముంచిన రనౌట్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్ తగిలింది. అభిషేక్ శర్మ అలసత్వం.. ట్రావిస్ హెడ్ ఉరుకులాట జట్టుకు నష్టం చేసింది. ఈ ఇద్దరి మధ్య సమన్వయం కోరవడంతో తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ(1) రనౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్క్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది జోరు కనబర్చిన ట్రావిస్ హెడ్.. ఐదో బంతికి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అభిషేక్ శర్మ వద్దని చెప్పినా అతను నాన్ స్ట్రైకర్‌వైపు వచ్చేసాడు. బంతిని అందుకున్నవిప్రజ్ నిగమ్ డైరెక్ట్ హిట్‌తో అభిషేక్ శర్మను రనౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ సన్‌రైజర్స్ పతనాన్ని శాసించింది.
చెలరేగిన స్టార్క్..
స్టార్క్ తన మరుసటి ఓవర్‌లో ఇషాన్ కిషన్(2)తో పాటు లోకల్ భాయ్ నితీష్ కుమార్ రెడ్డి(0)ని డకౌట్ చేశాడు. దాంతో సన్‌రైజర్స్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్(22)ను మిచెల్ స్టార్క్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో సన్‌రైజర్స్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. క్లాసెన్ భారీ సిక్స్‌తో పాటు బౌండరీ బాది ఒత్తిడిని తగ్గించాడు. అయితే అనికేత్ వర్మకు ఆరంభంలోనే లైఫ్ లభించింది. ఎక్స్‌ట్రా కవర్ దిశగా అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఇషన్ పోరెల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అనికేత్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లేలో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.
ఆదుకున్న అనికేత్ వర్మ..
పవర్ ప్లే అనంతరం అనికేత్ వర్మ ధాటిగా ఆడాడు. విప్రజ్ నిగమ్ ఓవర్‌లో ఓ బౌండరీ. సిక్స్ బాదిన అనికేత్.. అక్షర్ పటేల్ మరుసటి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. మరోవైపు క్లాసెన్ కూడా బౌండరీలు బాదడంతో సన్‌రైజర్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. 77 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మోహిత్ శర్మ విడదీసాడు. హెన్రీచ్ క్లాసెన్(32)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అభినవ్ మనోహర్(4), ప్యాట్ కమిన్స్(2) విఫలమైనా.. మరోవైపు అనికేత్ వర్మ భారీ షాట్లతో చెలరేగాడు.
స్టన్నింగ్ క్యాచ్..
ఈ క్రమంలో అతను 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అనికేత్ వర్మ మరుసటి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. అతను ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై ఫ్రెజర్ మెక్‌గర్క్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో సిక్సర్ వెళ్లాల్సిన బంతి క్యాచ్ ఔట్‌గా మారింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన వియాన్ మల్డర్(9), హర్షల్ పటేల్(5) కూడా తీవ్రంగా నిరాశపర్చడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకే కుప్పకూలింది.