
అబుదాబి: రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 43) మినహా అంతా విఫలమయ్యారు. దాంతో రాజస్థాన్ ముందు పంత్ సేన 155 పరుగుల సాధారణ లక్ష్యం ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. అయ్యర్, రిషభ్ పంత్(24), షిమ్రన్ హెట్‌మైర్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(2/22), చేతన్ సకారియా (2/33) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగీ చెరొక వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈ సీజన్‌లో జోరు మీదున్న శిఖర్ ధావన్‌ను కార్తీక్ త్యాగీ అనూహ్య రీతీలో పెవిలియన్ చేర్చాడు. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ధావన్ ఔటైన వెంటనే మరో ఓపెనర్ పృథ్వీ షా(10) సైతం పెవిలియన్ చేరాడు. సకారియా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఢిల్లీ 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రిషభ్ పంత్(24), మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(43) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్‌తో రిషభ్ పంత్‌ను బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్(28) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. అతనికి ముస్తాఫిజుర్ కళ్లెం వేసాడు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్(12) ఔటవ్వగా.. లలిత్ యాదవ్(14 నాటౌట్), అశ్విన్(6 నాటౌట్) క్విక్ సింగిల్స్‌తో స్కోర్ బోర్డు 150 మార్క్ ధాటించారు.