
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్(8) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఈ సీజన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ధావన్ ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తూ ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. యూఏఈ గడ్డపై మొదలైన సెకండాఫ్‌లోను అదే జోరును కొనసాగించి 400 ప్లస్ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌లో మాత్రం అతను దురదృష్టవశాత్తు పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ యువపేసర్ కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసిన ధావన్.. అది వికెట్లను తాకుతుందని గ్రహించలేకపోయాడు. కార్తీక్ త్యాగీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతిని ధావన్ డిఫెన్స్ చేయగా.. బంతి ఒన్ స్టప్ బౌన్స్‌తో వికెట్లను తాకేసింది. బంతిని అడ్డుకునే ప్రయత్నం ధావన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో గబ్బర్ చిరునవ్వులు చిందిస్తూ క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కార్తీక్ త్యాగీ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను ములపు తిప్పాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోను కొనసాగించాడు. తాను వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే కీలక ధావన్‌ను ఔట్ చేశాడు. దాంతో కార్తీక్ త్యాగీపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎక్కడ ఆపాడో.. అక్కడి నుంచే మొదలుపెట్టాడని కొనియాడుతున్నారు. మరికొందరమో.. కార్తీక్ త్యాగీ చాలా లక్కీ అయితే ధావన్ అన్ లక్కీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక శిఖర్ ధావన్ ఔటైన వెంటనే మరో ఓపెనర్ పృథ్వీ షా(10) సైతం పెవిలియన్ చేరాడు. దాంతో ఢిల్లీ 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ రిషభ్ పంత్(24), మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(43) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్‌తో రిషభ్ పంత్‌ను బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్(28) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. అతనికి ముస్తాఫిజుర్ కళ్లెం వేసాడు.