ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కీలక సమయంలో షై హోప్ సంచలన క్యాచ్‌తో సంజూ శాంసన్ ఔటవ్వడం రాజస్తాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) మెరుపులు మెరిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్(3/24) మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిక్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు.

జైస్వాల్ విఫలం..
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్(4) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి జోస్ బట్లర్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది.
63 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. జోస్ బట్లర్(19)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. రియాన్ పరాగ్‌తో కలిసి సంజూ శాంసన్ చెలరేగాడు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడు బంతులను బౌండరీకి తరలిచింది.
సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ..
ఈ క్రమంలో సంజూ శాంసన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని రసిక్ సలామ్ విడదీసాడు. రియాన్ పరాగ్(25)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 36 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడగా ఆడిన సంజూ శాంసన్ వేగంగా పరుగులు రాబట్టాడు.
అతనికి తోడు శుభ్‌మ్ దుబే కూడా హిట్టింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డ్ పరుగెత్తింది. ఈ పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను షైహోప్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంజూ శాంసన్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద షైహోప్ అద్భుతంగా అందుకున్నాడు.

హైడ్రామా..?
ఏ మాత్రం సమన్వయం కోల్పోకుండా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే రీప్లేలో అతను బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌కు తాకినట్లు అనిపించింది. దాంతో సంజూ శాంసన్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. క్రీజును వీడేందుకు నిరాకరించాడు. చివరకు అంపైర్లు సర్దిచెప్పడంతో వెనక్కివెళ్లిపోయాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత శుభమ్ దూబే(25)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా.. డోనోవన్ ఫెర్రెరియా(1), రవిచంద్రన్ అశ్విన్(2) దారుణంగా విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్ సాయంతో రోవ్‌మన్ పోవెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో 29 పరుగులు అవసరమవ్వగా.. ముఖేష్ కుమార్ డేంజరస్ రోవ్‌మన్ పోవెల్(13) క్లీన్ బౌల్డ్ చేసి ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.