IPL 2020: కోహ్లీ, పాంటింగ్ మధ్య గొడవ.. అసలు కారణమేంటో చెప్పిన అశ్విన్!!

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా నవంబర్ 2న లీగ్ మ్యాచ్ అది.. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కీలక మ్యాచ్. ఎవరూ కూడా ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఆ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అది చిన్నపాటి గొడవకు దారితీసింది. ఆ విషయం అప్పుడూ ఎవరికీ తెలియరాలేదు.

భయంకరమైన నొప్పి
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ.. ఆ గొడవకు గల అసలు కారణమేంటో తెలిపాడు. 'ఆ మ్యాచ్‌లో నా బౌలింగ్ కోటా పూర్తయిన అనంతరం ఫీల్డింగ్ చేయలేదు. వెన్ను నొప్పి కారణంగా మైదానాన్ని వీడా. అది భయంకరమైన నొప్పి. ఎంఆర్‌ఐ స్కాన్ తీశారు. వీపు వెనక భాగంలో నరంకు దెబ్బతాకినట్టు తేలింది. అందుకే మళ్లీ మైదానంలోకి వెళ్లలేదు. స్ట్రాటజిక్ టైం బ్రేక్ సమయంలో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ సపోర్ట్ స్టాఫ్ ఈ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేశారు' అని అశ్విన్ తెలిపాడు.

కోహ్లీ, పాంటింగ్ మధ్య గొడవ
'మైదానంలోకి వెళ్లిన రికీ పాంటింగ్.. విరాట్ కోహ్లీ సహా ఆర్సీబీ సపోర్ట్ స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగాడు. వెన్ను నొప్పి కారణంగానే అశ్విన్ ఫీల్డింగ్ చేయడం లేదని వారితో చెప్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, పాంటింగ్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. నాకు నొప్పి వేధిస్తుందనే విషయం తెలియక ఆర్సీబీ అలా ప్రశ్నించింది. ఆపై పాంటింగ్ వివరించాడు. పాంటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం నుంచి వెనక్కి తగ్గడు. ఈ విషయం అందరికీ తెలిసిందే' అని స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు.

కోహ్లీని ఔట్ చేయడం సంతోషం
'ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. కోహ్లీకి బౌలింగ్ చేయడాన్ని నేనెప్పుడూ ఇష్టపడతా. నా బౌలింగ్‌లో విరాట్ ఎప్పుడూ వికెట్ పారేసుకోలేదు. వికెట్ ఇవ్వకపోడాన్ని కోహ్లీ గౌరవంగా భావిస్తాడు. ఎంఎస్ ధోనీ కూడా ఇలాగే ఆడేవాడు. ఎట్టకేలకు విరాట్ వికెట్ పడగొట్టడం ఆనందం కలిగించింది. 2016 ఐపీఎల్‌లో కోహ్లీ వికెట్ పడగొట్టే అవకాశం వచ్చినా.. ఫీల్డర్ అంకిత్ శర్మ క్యాచ్ జారవిడిచాడు. అప్పటి నుంచి నా బౌలింగ్‌లో విరాట్ ఔట్ కాలేదు. దీంతో విరాట్‌ను అశ్విన్ ఔట్ చేయలేడని అనడం మొదలుపెట్టారు. చివరికి అతని వికెట్ తీసుకున్నా. అది సంతోషకరమైన క్షణం' అని ఢిల్లీ స్పిన్నర్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

రన్నరప్‌గా:
నవంబర్ 2న జరిగిన లీగ్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కోహ్లీసేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనను ఢిల్లీ మరో 6 బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్య రహానె (60: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక క్వాలిఫైయర్-1లో ముంబై చేతిలో ఓడినా.. క్వాలిఫైయర్-2లో హైదరాబాద్‌పై ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
'చిన్నతనం నుంచి రోహిత్ అంతే.. అతడి ఆలోచన ఎప్పుడూ దానిపైనే ఉంటుంది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications