'చిన్నతనం నుంచి రోహిత్ అంతే.. అతడి ఆలోచన ఎప్పుడూ దానిపైనే ఉంటుంది'

ముంబై: ముంబై ఇండియన్స్ ప్రపంచంలో అత్యుత్తమ టీ20 ఫ్రాంచైజీ. ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై విజేతగా నిలిచి.. ఐదోసారి టైటిల్ గెలిచి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2013, 2015, 2017, 2019 సీజన్లలోనూ ముంబై చాంపియన్‌గా నిలిచింది. ఐదు ట్రోఫీలు కూడా రోహిత్ శర్మ సారథ్యంలోనే గెలవడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు రోహిత్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్‌గా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. క్రికెట్ దిగ్గజాలు అందరూ హిట్‌మ్యాన్‌ను భారత పరిమిత ఓవర్ల సారథిగా నియమించాలని బీసీసీఐని కోరుతున్నారు.

ఓటమి గురించి ఆలోచించడు:
తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి అతడి చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ మాట్లాడారు. చిన్నతనం నుంచే రోహిత్ ఆలోచన ఎపుడూ విజయంపైనే ఉండేదని, అప్పటినుంచే అతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పేరొన్నారు. 'రోహిత్ శర్మ ఆలోచన ఎప్పుడూ విజయంపైనే ఉంటుంది. ఓటమి గురించి అస్సలు ఆలోచించడు. ముంబై జట్టు బాధ్యతలు అందుకున్నాక నాయకుడిగా అతడి నైపుణ్యం ఏంటో నిరూపించాడు. ఇది అతడి కెరీర్‌కు ఎంతో దోహదపడింది. అతడికి బాధ్యతలు మరిన్ని పెరిగినా.. ఒత్తిడి పెరగలేదు. అతడిలో నాయకత్వ లక్షణాలు చిన్నతనంలోనే గుర్తించా' అని దినేశ్ లాడ్ తెలిపారు.

ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు:
'పాఠశాల స్థాయి క్రికెట్‌లో జట్టును నడిపించమంటే.. రోహిత్ శర్మ ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించేవాడు. 40 పరుగులకే ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయిన సందర్భాల్లో జట్టు స్కోరును 220 పరుగులకు తీసుకువచ్చేవాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు. మేం మ్యాచ్‌ను కోల్పోతామనే పరిస్థితుల్లో ఆఖరి వరకు క్రీజులో ఉండమని అతడికి చెబితే.. జట్టును గెలిపించే బాధ్యత నాది అని రోహిత్ మాతో చెప్పేవాడు. అలా చెప్పడమే కాదు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు కూడా' అని రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ పేర్కొన్నారు.

కెప్టెన్సీ ఇవ్వాలని నేను చెప్పను:
రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించడం గురించి మాట్లాడుతూ... 'కెప్టెన్సీ గురించి నేను మాట్లాడలేను. అది బీసీసీఐ, సెలక్టర్ల చేతిలో ఉంటుంది. అయితే శర్మకి అవకాశం ఇస్తే సత్తా చాటగలడు. గతంలో నిదాహాస్ ట్రోఫీ వంటి కొన్ని ట్రోఫీలను గెలిచి చూపించాడు. అతడికి కెప్టెన్సీ ఇవ్వాలని నేను చెప్పను కానీ అవకాశం ఇస్తే అతడేంటో నిరూపిస్తాడు. విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటాడు. రోహిత్ శర్మ మాత్రం ప్రశాంతంగా జట్టును నడిపిస్తాడు' అని దినేశ్ లాడ్ చెప్పుకొచ్చారు.

బెంగళూరుకే రోహిత్:
రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది. దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీకి వెళ్ళింది. గాయాల నుంచి కోలుకొం టున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ పునరావాసం కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు చేరుకోనున్నారు. వీరిద్దరికి టెస్ట్ టీమ్‌లో చోటుదక్కడంతో కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్తారు. కండర గాయం కారణంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా టీమిండియాతో కలసి ఆసీస్‌కు బయల్దేరాడు. అతడి ఫిట్‌నెస్‌ను పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ నెల 27న ఆసీస్ టూర్ మొదలవనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications