DC vs RCB: బుసలు కొట్టిన బంతి.. కుప్పకూలిన ఢిల్లీ!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై బంతి బుసలు కొట్టడంతో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆర్‌సీబీ ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్(3/5) తీన్మార్ బౌలింగ్‌తో బంతిని నాగినీ ఆడించగా.. జోష్ హేజిల్‌వుడ్(4/12) బౌన్సర్లతో బోల్తాకొట్టించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) ఒంటరి పోరాటం చేయడంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డ్‌ను తప్పించుకుంది. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 16.3 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ముగిసింది.
8 పరుగులు 6 వికెట్లు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు భువనేశ్వర్ కుమార్ రెండో బంతికే షాకిచ్చాడు. యువ ఓపెనర్ సహిల్ పరక్(0)ను క్యాచ్ ఔట్ చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండో ఓవర్‌లో కేఎల్ రాహుల్(1), సమీర్ రిజ్వీ(0)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు.

భువనేశ్వర్ కుమార్ తానేం తక్కువా? అన్నట్లు ట్రిస్టన్ స్టబ్స్(5)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు అక్షర్ పటేల్(0)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 16 బంతుల వ్యవధిలోనే ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయింది. హేజిల్‌వుడ్ నాలుగో ఓవర్‌లో నితీష్ రాణా(1)ను క్యాచ్ ఔట్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అత్యల్ప పవర్ ప్లే స్కోర్..
ఇషాన్ పోరెల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించగా.. మిల్లర్‌తో కలిసి పవర్ ప్లేను ముగించాడు. ఇక పవర్ ప్లేలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 13 పరుగులే చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ చెత్తి రికార్డును మూటగట్టుకుంది. డేవిడ్ మిల్లర్ బౌండరీలతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా అతన్ని రసిక్ సలామ్‌దార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
టెయిలెండర్ కైల్ జెమీసన్ సిక్స్, బౌండరీ బాదగా.. అతన్ని కృనాల్ పాండ్యా(12) వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. ఆచితూచిన ఆడిన కుల్దీప్ యాదవ్(3)ను సుయాష్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయగా.. అభిషేక్ పోరెల్(30)ను హెజిల్ వుడ్ పెవిలియన్ చేర్చి ఢిల్లీ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. ఆర్‌సీబీపై అత్యల్ప స్కోర్ నమోదు చేసిన మూడో జట్టుగా కూడా ఢిల్లీ అప్రతిష్టను మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications