న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా మరే బ్యాటర్ రాణించకపోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
ప్రభ్‌సిమ్రాన్ తర్వాత సామ్ కరణ్(20) ఒక్కడే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ప్రవీణ్ దుబే, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కెప్టెన్ శిఖర్ ధావన్(7)ను ఇషాంత్ శర్మ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో డేంజరస్ లియామ్ లివింగ్ స్టోన్(4)ను ఇషాంత్ శర్మ క్లీన్ బౌల్డ్ చేయగా.. జితేశ్ శర్మ(5)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. దాంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులే చేసింది.
ఈ పరిస్థితుల్లో సామ్ కరణ్‌తో కలిసి మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడిన ప్రభ్ సిమ్రాన్.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రవీణ్ దూబే విడదీసాడు.
సామ్ కరణ్(20)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి నాలుగో వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. సామ్ కరణ్ ఔటైనా.. ప్రభుసిమ్రాన్ సింగ్ ధాటిగా ఆడాడు. భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఔటైనా.. దూకుడు తగ్గించని ప్రభ్ సిమ్రాన్ సింగ్ 61 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం 19 బంతుల్లోనే ప్రభ్‌సిమ్రాన్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
అయితే అతని జోరుకు ముఖేశ్ కుమార్ బ్రేక్ వేసాడు. క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. షారుఖ్ ఖాన్(2) కూడా రనౌటవ్వడంతో పంజాబ్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.