న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు దుమ్మురేపారు. పియూష్ చావ్లా(3/22), జాసన్ బెహెండార్ఫ్(3/23) మూడేసి వికెట్లతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది.
డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో చావ్లా, బెహెండార్ఫ్‌కు తోడుగా రిలే మెరిడిత్ రెండు వికెట్లు తీయగా.. హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే పృథ్వీ షా(15) క్యాచ్ ఔటవ్వగా.. మనీశ్ పాండే(26)తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని పియూష్ చావ్లా విడదీసాడు. తన వరుస ఓవర్లలో మనీశ్ పాండే(26)తో పాటు యశ్ ధూల్(2), రోవ్‌మన్ పోవెల్(4), లలిత్ యాదవ్(2)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఢిల్లీ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్ కాస్త నెమ్మదిగా ఆడిన అక్షర్ పటేల్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌లను ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నేలపాలు చేశారు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో అక్షర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ అందుకోలేకపోవడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేరుగా అతని నెత్తికి బలంగా తాకడంతో సూర్య మైదానం వీడాడు. మెరిడిత్ 18వ ఓవర్‌లో 4, 6 బాదిన అక్షర్ పటేల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో అక్షర్ పటేల్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. 19వ ఓవర్‌లో బెహెండార్ఫ్ అక్షర్ పటేల్(54)ను ఔట్ చేయడంతో 6వ వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వార్నర్, కుల్దీప్ యాదవ్(0) రనౌటవ్వగా.. చివరి బంతికి బెహెండార్ఫ్ క్యాచ్ ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో అన్రిచ్ నోర్జ్ బౌండరీ ఔటవ్వడంతో ఢిల్లీ 172 పరుగులకు కుప్పకూలింది.