
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(51 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 77), దీపక్ హుడా(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ఢిల్లీ ముందు లక్నో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. హుడా, రాహుల్ రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించగా.. చివర్లో మార్కస్ స్టోయినిస్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(23), కేఎల్ రాహుల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే వీరి జోరుకు శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేసాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో డికాక్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కూడా ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.

అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ.. ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడింది. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో లక్నో 10 ఓవర్లలోనే 94 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసి 35 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లోనే దీపక్ హుడా సైతం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. దీపక్ హుడాను రిట్నర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి 95 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి స్టోయినీస్ రాగా కేఎల్ రాహుల్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి ఆ మరుసటి బంతికే లలిత్ యాదవ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినీస్ సిక్సర్‌తో స్టోయినీస్ 190 పరుగుల మార్క్ ధాటించాడు.