ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం వైజాగ్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. అషుతోష్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో ఢిల్లీకి విజయాన్నందించాడు. గత సీజన్ తరహాలోనే అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ మార్ష్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్(30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/42) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/20) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసి గెలుపొందింది. అషుతోష్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. విప్రజ్ నిగమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), ట్రిస్టన్ స్టబ్స్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(2/19), మనిమరణ్ సిద్దార్థ్(2/39), దిగ్వేష్ రతి(2/31), రవి బిష్ణోయ్(2/53) రెండేసి వికెట్లు తీసారు.
ఆఖరి ఓవర్‌లో మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని రిషభ్ పంత్ చేజార్చాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. ఈ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై.. లక్నో గెలిచేది. మరోవైపు అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయాన్నందించాడు.