న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు రఫ్ఫాడించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌తోనే కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన జాసన్ రాయ్(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43) ఒక్కడే రాణించగా.. చివర్లో ఆండ్రీ రస్సెల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ(2/19), అన్రిచ్ నోర్జ్(2/15), అక్షర్ పటేల్(2/13), కుల్దీప్ యాదవ్(2/15) రెండేసి వికెట్లు తీయగా.. ముఖేశ్ కుమార్(1/34) ఓ వికెట్ తీసాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ బ్యాటింగ్‌కు దిగింది. పిచ్‌ను కవర్స్ కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి బౌలర్లకు అనుకూలంగా మారిపోయింది.

ముఖేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోనే ఓపెనర్ లిటన్ దాస్(4) క్యాచ్ ఔటవ్వగా.. నోర్జ్ వేసిన మరుసటి ఓవర్‌లో వెకంటేశ్ అయ్యర్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్ శర్మ వేసిన 6వ ఓవర్‌లో కెప్టెన్ నితీశ్ రాణా(4) క్యాచ్ ఔటవ్వడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 3 వికెట్లకు 35 పరుగులు మాత్రమే చేసింది.
అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్‌లో మన్‌దీప్ సింగ్(6) క్లీన్ బౌల్డ్ కాగా.. డేంజరస్ రింకూ సింగ్(6)ను అక్షర్ తన మరుసటి ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే ఇషాంత్ శర్మ.. సునీల్ నరైన్(4) ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన జాసన్ రాయ్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు.
ఆ మరుసటి బంతికే అనుకుల్ రాయ్(0) గోల్డెన్ డకౌట్ చేసిన కుల్దీప్ యాదవ్.. హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని అందుకున్నాడు. కానీ ఉమేశ్ యాదవ్ వికెట్ పడకుండా ఆడటంతో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ చాన్స్ మిస్సయ్యింది. ఉమేశ్ యాదవ్(3)ను అన్రిచ్ నోర్జ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చడంతో 96 పరుగులకే కేకేఆర్ 9 వికెట్లు కోల్పోయింది.
వరుణ్ చక్రవర్తీ(1) సాయంతో ఆండ్రీ రస్సెల్ చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాది జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. చివరి బంతికి పరుగు తీసే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తీ రనౌటయ్యాడు.