DC vs CSK: ఫైనల్ వేటలో కుర్రాళ్లు X డాడీస్ ఆర్మీ.. ఢిల్లీ టీమ్‌లోకి ఆ స్టార్ ఆల్‌రౌండర్! తుది జట్లు ఇవే!

దుబాయ్: ఓవైపు అనుభవంతో కూడిన 'డాడీస్ ఆర్మీ'.. మరోవైపు జోరుమీదున్న యువ ఆటగాళ్ల బృందం.. ఒకరిదేమో మూడు సార్లు ట్రోఫీ గెలిచిన చరిత్ర.. మరొకరిది ఫస్ట్ టైమ్ టైటిల్ కోసం తహతహ.. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 14 మ్యాచ్‌ల్లో.. పదింట్లో గెలిచి 20 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంతో.. 9 విజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్‌కే రెండో స్థానంతో లీగ్ దశను ముగించాయి. లీగ్ సాంతం ఈ రెండు జట్లు మెరుగ్గానే కనిపించాయి. అన్ని విభాగాల్లోనూ సత్తాచాటాయి.
అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సీఎస్‌కే కంటే ఢిల్లీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పట్టుదలతో ఉన్న ఢిల్లీ ప్రాణాలు పెట్టి ఆడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. లీగ్ దశలో సీఎస్‌కేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ధోనీసేన ఓడినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలు సాధించడం ఆ జట్టుకు అలవాటే. కాగా, ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన టీమ్.. ఆర్‌సీబీ-కోల్‌కతా మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో క్వాలిఫయర్2లో పోటీ పడుతుంది.

పటిష్టంగా పంత్ సేన..
తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ గత కొన్నేళ్లుగా ఎంతో మెరుగైంది. కోచ్ రికీ పాంటింగ్ ప్రణాళికలు గత రెండు సీజన్లుగా మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. నిలకడైన బ్యాటింగ్, కట్టడి చేసే బౌలింగ్ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. 2019లో రెండో క్వాలిఫయర్‌లో ఓడిన ఆ జట్టు.. గతేడాది ఫైనల్లో పరాజయం పాలైంది. గత రెండు సార్లు టైటిల్‌కు చేరువై దూరమైన ఆ జట్టు.. ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్(544), పృథ్వీ షా(401) జట్టుకు గొప్ప ఆరంభాలనిస్తున్నారు.
ఈ ఇద్దరూ ఇదే జోరు కొనసాగిస్తే.. ఢిల్లీ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక ఆ తర్వాత పంత్, శ్రేయస్ అయ్యర్, హెట్‌మయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్‌తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఢిల్లీ ఆడింది. కానీ చెన్నైతో మ్యాచ్‌కు స్టోయినిస్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నట్లు పంత్ చెప్పాడు. ఈ నేపథ్యంలో స్టోయినిస్ జట్టులోకి వస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టుకు మేలవుతుంది. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అవేశ్ ఖాన్ (22)తో పాటు సఫారీ పేస్ ద్వయం రబడా, నోర్జ్‌తో కూడిన పేస్ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్షగా నిలుస్తోంది. పవర్‌ప్లేలో, మధ్య ఓవర్లలో అక్షర్ (15) తన స్పిన్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి బంతి వేయాలనే పూర్తి అవగాహన, అనుభవం ఉన్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌తో ప్రత్యర్థులకు ముప్పు తప్పదు.

ఓపెనర్లపైనే భారం..
2020 ముందు వరకూ ఆడిన అన్ని సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే.. గతేడాది మాత్రం పేలవ ప్రదర్శనతో తొలిసారి కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టుపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. కానీ ఈ సీజన్‌లో సరికొత్తగా అడుగుపెట్టిన చెన్నై.. ఆ సందేహాలను పటాపంచలు చేసి పాత సీఎస్కేను గుర్తు చేస్తూ అదరగొడుతోంది. నాలుగో టైటిల్‌ను పట్టేయాలని చూస్తోంది. అయితే చెన్నై బ్యాటింగ్ బలంతో టోర్నీలో ముందడుగేసింది. సింహ భాగం మ్యాచ్‌ల్లో జట్టు భారమంతా రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మోశారు. అడపాదడపా రాయుడు, మొయిన్ అలీ మెరిపిస్తున్నాడు.
అనుభవజ్ఞుడైన సురేశ్ రైనా వైఫల్యం వల్ల రాబిన్ ఉతప్పకు అవకాశమిచ్చారు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో మళ్లీ రైనాను తుది జట్టులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ధోని మార్క్ ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో ఇంకా బాకీ ఉంది. ఈ మ్యాచ్‌లో అతని నుంచి 'విజిల్ పొడు'చే ఇన్నింగ్స్ ఆవిష్కృతమైతే తప్పకుండా చెన్నై అభిమానులకు పండగే! బ్రావో 'ఎక్స్‌ట్రా'ల బౌలింగ్ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్‌ల్లో బ్రావో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఎక్స్‌ట్రాల రూపంలో విరివిగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, హాజల్‌వుడ్‌లు ఆరంభ ఓవర్లలో కట్టడి చేయగలిగితే స్పిన్‌తో జడేజా మాయచేసేందుకు అవకాశముంటుంది. ఢిల్లీ ఎంత బలంగా ఉన్నా... మాజీ చాంపియన్ చెన్నై వీరంగం చేస్తే కష్టాలు తప్పవు.

పిచ్ రిపోర్ట్:
దుబాయ్ పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనూ స్కోరు 170 దాటలేదు. బౌలర్లకు ఎక్కువగా సహకరించే ఆస్కారముంది. ఇక టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండనుంది.

తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ (కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, హెట్‌మైర్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబడ, నోర్జే, అవేశ్ ఖాన్.
చెన్నై సూపర్‌కింగ్స్: ధోనీ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప/సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, హాజెల్‌వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications