
11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం బోల్తాకొట్టిస్తుంటాడు. తన పదునైన బంతులతో వికెట్లు పడగొడుతూ..పరుగులను నియంత్రిస్తుంటాడు. ఫార్మాట్ ఏదైనా సత్తాచాటాడమే మనోడికి తెలుసు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో అన్ని జట్లకు రషీద్ ఖాన్ చుక్కలు చూపించాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ మరింత చెలరేగాడు.
ఢిల్లీపై ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లు ఆడిన రషీద్.. 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న జట్లపై ఇదే అత్యుత్తమ రికార్డు. అంతేకాదు ఢిల్లీపై రషీద్ ఎకానమీ 5.63 మాత్రమే. ఢిల్లీపై ఓ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ ఎకానమీ కూడా ఇదే. అందుకే ఈ మ్యాచుకు ముందు రషీద్ గణాంకాలు ఢిల్లీని కలవరపెడుతున్నాయి.

మంచి ఎకానమీ రేటు
ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే దుబాయ్‌లోనూ రషీద్ ఖాన్‌కు మంచి ఎకానమీ రేటు ఉంది. కనీసం 20 ఓవర్లకుపైగా వేసిన బౌలర్లలో రషీద్‌దే అత్యుత్తమ ఎకానమీ రేటు. కచ్చితమైన లైన్ అండ్ లెంత్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం రషీద్ ప్రత్యేక శైలి. ముఖ్యంగా అటాక్ చేయడానికి ప్రయత్నించే బ్యాట్స్‌మెన్ రషీద్‌కు సునాయాసంగా దొరికిపోతారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్, జొస్ బట్లర్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ ఆటగాళ్లను సైతం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతారు. అయితే ఐపీఎల్ 2021 తొలి లెగ్‌లో అంచనాలను అందుకోలేకపోయిన రషీద్.. ఈ రెండో లెగ్‌లో మంచి ప్రదర్శన చేయాలమీ ఫాన్స్ ఆశిస్తున్నారు.

అద్భుతం జరిగితే తప్పా
భారత్ వేదికగా జరిగిన తొలి దశ లీగ్‌లో సన్‌రైజర్స్ 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా.. ఇది సాధ్యం కాదు. సెకండాఫ్‌లో ఏడు మ్యాచ్‌లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి నెలకొంది. లేదంటే మెరుగైన రన్‌రేట్‌తో 6 మ్యాచ్‌లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే.. అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్‌తో గెలిచే మ్యాచ్‌లను కూడా ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకుంది.

నటరాజన్, శంకర్ దూరం
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ టీ నటరాజన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురుని ఐసోలేషన్‌కు తరలించామని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. వారిలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, టీం మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేశన్ ఉన్నారు. ఈ రోజటి మ్యాచుకు నటరాజన్‌తో పాటు శంకర్ కూడా దూరం అయ్యారు.


Click it and Unblock the Notifications

PBKS vs RR: దురదృష్టవశాత్తూ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లింది.. ఆ రెండు బంతులు లాటరీ లాంటివే: కుంబ్లే










