
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ గెలుపు ముంగిట చేతులెత్తేసిన విషయం తెలిసిందే. అంపైర్ తప్పిదం కారణంగా సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఢిల్లీ బోణీ కొట్టింది. సూపర్ ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన కింగ్స్ పంజాబ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ సూపర్ ఓవర్ స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ అప్రతిష్టపాలైంది.
ఢిల్లీ తరఫు కగిసో రబడా సూపర్ ఓవర్ వేయగా.. తొలి బంతి ఆడిన కేఎల్ రాహుల్ రెండు పరుగులు తీసాడు. అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక మూడో బంతిని ఎదుర్కొన్న నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాత ఢిల్లీ రెండు బంతుల్లోనే చేధించింది. తొలి బంతిని డాట్ చేసి పంత్ టెన్షన్ పెట్టాడు. ఇక రెండో బంతి షమీ వైడ్ వేయడం.. మూడో బంతికి పంత్ రెండు పరుగులు చేయడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
అంతకు ముందు సూపర్ ఓవర్ లోయెస్ట్ స్కోర్ 6 పరుగులుగా ఉండగా.. తాజా మ్యాచ్‌తో పంజాబ్ 2 పరుగులతో తమ పేరిట లిఖించుకుంది. ఇక సూపర్ ఓవర్‌లో అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా రబడా గుర్తింపు పొందాడు. అంతకు ముందు ముంబై ఇండియన్స్ పేసర్లు మిచెల్ జాన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా 6 పరుగులే ఇచ్చారు. 2015 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మిచెల్ జాన్సన్ 6 పరగులకే కట్టడి చేయడగా.. 2017లో గుజరాత్ లయన్స్‌ను బుమ్రా కూడా 6 పరుగులకే కట్టడి చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్‌లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
పంజాబ్ జట్టు విజయానికి 12 బంతుల్లో 25 పరుగుల కావాల్సిన క్రమంలో రబడా 19వ ఓవర్ అందుకున్నాడు. క్రీజులో మయాంక్, క్రిస్ జోర్డాన్ ఉన్నారు. తొలి బంతిని డాట్ చేసిన అగర్వాల్ రెండో బంతిని ఫోర్ కొట్టాడు. ఇక మూడో బంతి ఎక్స్‌ట్రా కవర్ రీజియన్ వైపు ఆడి క్విక్ డబుల్ తీశాడు. లెగ్ అంపైర్ నితీన్ మీనన్ మాత్రం క్రిస్ జోర్డాన్ పరుగు పూర్తి చేయలేదని ఓ రన్ షార్ట్ చేశాడు. టీవీ రిప్లేలో మాత్రం అతను లైన్‌మీదనే బ్యాట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఈ పరుగే ఆ జట్టు ఖాతాలో చేరి ఉంటే పంజాబ్ సూపర్ ఓవర్ అవసరం లేకుండానే గెలిచేది. ఈ అంపైర్ తప్పిదంపై తీవ్ర దుమారం రేగుతుంది.