DC Retention Players For IPL 2022: శ్రేయస్ ఔట్.. పృథ్వీ షా డౌట్! ఢిల్లీ రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను మరింత విస్తృతి పరచాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్తగా రెండు జట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను ముగించిన బీసీసీఐ మెగా వేలం నిర్వహణపై దృష్టి సారించింది. డిసెంబర్ చివరి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్తగా వచ్చిన జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది.
దాంతో ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక మెగవేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని సిద్దం చేసిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చింది. నవంబర్ 30లోపు తమ రిటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి ముగ్గురిని ఎంచుకునే అవకాశం కొత్త జట్లకు కల్పించింది. ఈ ప్రక్రియను డిసెంబర్ తొలి వారంలో పూర్తి చేయాలని చెప్పింది.

రిటెన్షన్ రూల్స్ ఇవే..
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలతో ఫ్రాంచైజీల కోర్ టీమ్ చెల్లాచెదురు కానుంది. అంతేకాకుండా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరిని తీసుకోవాలనేది కూడా ఫ్రాంచైజీలకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే బలమైన లైనప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రిషభ్ పంత్..
ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా రూ.16 కోట్లు చెల్లించి మరీ రిటైన్ చేసుకోనుంది. 2016 నుంచి ఢిల్లీకి ఆడుతున్న పంత్.. ప్రతీ సీజన్‌లో దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్.. సారథ్యంలో తన మార్క్ చూపించాడు. వరుస విజయాలతో ఢిల్లీని టాప్‌లోని నిలిపి టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే అయ్యర్ తిరిగొచ్చినా ఢిల్లీ యాజమాన్యం పంత్‌నే సారథిగా కొనసాగించింది. ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదరగొట్టడం పంత్‌కు ప్లస్ అయ్యింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.8 కోట్ల వేతనం అందుకున్న పంత్‌కు ఈసారి డబుల్ సాలరీ అందనుంది. తాజా సీజన్ పంత్ 16 మ్యాచ్‌ల్లో 419 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా 84 మ్యాచ్‌ల్లో 35.18 సగటుతో 2498 రన్స్ చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.

అన్రిచ్ నోర్జ్/రబడా..
ఇక ఢిల్లీ తమ రిటైన్ జాబితాలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. సౌతాఫ్రికా స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జ్, కగిసో రబడాలను రిటైన్ చేసుకోనుంది. గత రెండు సీజన్లుగా ఈ ఇద్దరు దుమ్మురేపుతున్నారు. తాజా సీజన్‌లో రబడా 15 వికెట్లే తీసినప్పటికీ.. గతేడాది 30 వికెట్లు పడగొట్టాడు. ఇక అన్రిచ్ నోర్జ్ ఈ సీజన్‌లో 12 వికెట్లు తీయగా.. గత సీజన్‌లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఇద్దరిని సెకండ్, మూడో స్లాబ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకుంటే ఒక్కొక్కరి రూ.12, రూ.8 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నోర్జ్ ఐపీఎల్ 2021 సీజన్‌లో రూ.89.82 లక్షల వేతనం మాత్రమే అందుకోగా.. రబడా రూ.4 కోట్ల 20 లక్షలు తీసుకున్నాడు. దాంతో వీరి జీతాలు ఎన్నో రెట్లు పెరగనున్నాయి. అయితే వీరు వేలంలోకి వెళ్లినా ఇంతే ధర పలికే అవకాశం ఉంది. ఒకవేళ వీరికి ఇంత ధర ఎక్కువనుకుంటే ఒక్కరిని తీసుకునే అవకాశం ఉంది.

పృథ్వీషా..
ఇక నాలుగో స్లాబ్ ప్లేయర్‌గా రూ.6 కోట్లకు పృథ్వీషాను రిటైన్ చేసుకునే చాన్సుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో షా రూ. కోటీ 20 లక్షల వేతనాన్ని అందుకున్నాడు. ఈ లెక్కన అతని సాలరీ 5 రెట్లు పెరగనుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి పృథ్వీషా వంటి ఓపెనర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో ఎగబడతాయి. ఈ క్రమంలోనే అతన్ని వదులుకునే సాహసం ఢిల్లీ చేయకపోవచ్చు. పైగా ఎంతో భవిష్యత్తు ఉన్న పృథ్వీషాను జట్టులో ఉంచుకోవడం మేలని ఆ జట్టు ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన షా.. 479 రన్స్ చేసాడు.

శిఖర్ ధావన్, అయ్యర్‌కు నో చాన్స్..
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లకు రిటెన్షన్ జాబితాలో చోటుదక్కేలా లేదు. వయసు దృష్ట్యా ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన ధావన్.. ఐపీఎల్‌లో నిలకడగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఈ కారణంతోనే ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ పక్కనపెట్టనుంది. అవసరమైతే వేలంలో తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నించనుంది. ఇక శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకున్నా.. ఆటగాడిగా అతను జట్టులో కొనసాగలేని పరిస్థితి. కొత్తగా రెండు జట్లు వస్తున్న నేపథ్యంలో ఏదో టీమ్‌కు కెప్టెన్‌గా ఉండాలని అయ్యర్ భావిస్తున్నాడు. ఈక్రమంలోనే స్వతహాగా ఢిల్లీ నుంచి తప్పుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications