
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఆటతో ఎలా అలరిస్తాడో.. సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ఎంటర్‌టైన్ చేస్తాడు. లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకున్న వార్నర్.. అనంతరం స్పూఫ్ వీడియోలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా తెలుగు ప్రజలతో మమేకమైన వార్నర్.. తరుచూ టాలీవుడ్ హిట్ సినిమాల ట్రైలర్స్‌ను పలు యాప్‌ల సాయంతో మార్ఫింగ్ చేస్తూ అభిమానులను అలరించాడు. అంతేకాకుండా పాపులర్ డైలాగ్స్ చెబుతూ.. ఫ్యామిలీతో డ్యాన్స్‌లు చేస్తూ అలరించాడు. హీరోల దేహానికి తన ముఖాన్ని జత చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు.
ఈ మధ్య ఈ తరహా వీడియోలకు కాస్త బ్రేక్ ఇచ్చిన వార్నర్ మళ్లీ మొదలుపెట్టాడు. తెలుగు అభిమానులను అలరించడమే లక్ష్యంగా స్పూఫ్ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పాపులర్ సీన్‌ను స్పూఫ్ చేశాడు. ఆల్‌టైమ్ హిట్ పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని తన ఫేస్‌తో మార్ఫింగ్ చేసి నేనేవరో చెప్పుకోండి? అని ప్రశ్నించాడు. ఈ వీడియోను చూసిన తెలుగు అభిమానులు.. వార్నర్ బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ అయితే తెగ సంతోషపడుతున్నారు.
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతంది. ఇటీవలే ఆరోన్ ఫించ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను వార్నర్ అందుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో పాటు టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం వార్నర్‌కే సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అతనికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
అయితే 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ప్రధాన దోషిగా తేలిన డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీ చేపట్టకుండా జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం ఎత్తేయాలని గత కొన్నాళ్లు అతని సతీమణి, ఇతర ఆసీస్ మాజీ క్రికెటర్లు క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేస్తున్నారు. వార్నర్ సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.