
సిడ్నీ: కరోనా లాక్‌డౌన్ కాలాన్ని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో గడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కూతురి కోరిక మేరకు టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈవిధ్వంసకర బ్యాట్స్‌మన్.. వరుస వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. పైగా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టిక్‌టాక్ చేస్తూ ఈ క్వారంటైన్ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మా సాంగ్'కు సతీమణి క్యాండీస్‌తో కలిసి స్టెప్పులేసిన వార్నర్.. ఆ మూవీ హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆ టిక్‌టాక్ వీడియోలకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఓ త్రోబ్యాక్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. గత సీజన్ సందర్భంగా తన సన్‌రైజర్స్ సహచర ఆటగాళ్లైన భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్‌లతో కలిసి చేసిన ఓ సరదా వీడియోను వార్నర్ అభిమానులతో పంచుకున్నాడు.
ఈ వీడియోలో తొలి వరుసలో ఉన్న సీట్లలో విలియమ్సన్, భువీలు ఉండగా, వెనకాల సీట్లో వార్నర్ ఒక్కడే కూర్చొని ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో పాపులర్ పాప్ సాంగ్ 'వాట్ ఈజ్ లవ్' ప్లే అవుతూ ఉండగా... ఈ ముగ్గురు తమ సీట్లలోనే డ్యాన్స్ చేస్తుంటారు. ఇందులో విలియమ్సన్, భువీలు కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేయగా, వార్నర్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఊగిపోతూ ఉంటాడు. దీన్నే తాజాగా షేర్ చేసుకున్న వార్నర్..'ఇది నన్ను నవ్వుల్లో ముంచెత్తింది' అనే క్యాప్షన్ ఇచ్చాడు.