
న్యూఢిల్లీ: చేజేతులా గెలిచే మ్యాచ్‌లో ఓటమి చవి చూశామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్.. స్వీయ తప్పిదాలే జట్టు ఓటమిని శాసించాయని తెలిపాడు.
ముందు బ్యాటింగ్‌లో ఆ తర్వాత బౌలింగ్‌లో తప్పులు చేశామని చెప్పిన వార్నర్.. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. కీలక సమయంలో తాను రాంగ్ సైడ్ త్రో వేయడం కూడా జట్టు విజయవకాశాలను దెబ్బ తీసిందని చెప్పాడు.
'ఐపీఎల్ 2023 సీజన్‌లో గత మూడు మ్యాచ్‌లు చాలా అద్భుతంగా జరిగాయి. అభిమనులకు కావాల్సిన మజా లభించింది. కానీ ఈ రోజు మేం ఓటమిపాలయ్యాం. రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. అన్రిచ్ నోర్జ్ అసాధారణ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. ముస్తాఫిజుర్ కూడా రాణించాడు.
అయితే ఆఖరి బంతికి నేను రాంగ్ సైడ్ త్రో వేసాను. వికెట్ల హైట్ దృష్టిలోపెట్టుకొని పైకి విసరాను. అది ముంబైకి కలిసొచ్చింది. గత మూడు మ్యాచ్‌ల్లో మేం ఓడినా సానుకూలంశాలు లభించాయి. అక్షర్ పటేల్ టాప్-4లో ఆడాల్సిన అవసరం ఉంది. అతను చాలా స్పష్టంగా బంతిని హిట్ చేస్తున్నాడు.'అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 51), అక్షర్ పటేల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా(3/22), జాసన్ బెహెండార్ఫ్(3/23) మూడేసి వికెట్లతో చెలరేగగా.. రిలే మెరిడిత్ రెండు వికెట్లు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 31), తిలక్ వర్మ(29 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) విలువైన పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా.. అన్రిచ్ నోర్జ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.