‘నాన్న ఆ అంకుల్‌లా ఎందుకు ఆడటం లేదు’అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు: డేవిడ్ వార్నర్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌లా తానెందుకు సెంచరీలు చేయడం లేదని తన పిల్లలు ప్రశ్నిస్తున్నారని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. తాను సెంచరీలు చేయకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నారని చెప్పాడు. వాళ్లు ఇప్పుడు క్రికెట్ గేమ్‌ను అర్థం చేసుకొంటుండటం తనకు సంతోషంగా ఉందని వార్నర్ పేర్కొన్నాడు.
పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష్యచేధనలో డేవిడ్ వార్నర్( 30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 60 నాటౌట్) మరోసారి అర్థ శతకంతో మెరిసాడు.

బౌలర్ల వల్లే ఈ విజయం..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. గెలుపు క్రెడిట్ పూర్తిగా బౌలర్లదని చెప్పాడు. 'మా బౌలర్లు అద్భుతంగా రాణించి మా పనిని మరింత తేలిక చేశారు. క్రెడిట్ అంతా వాళ్లకే దక్కుతుంది. లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మా జట్టులో కొవిడ్ కేసులు వచ్చాక మేం తిరిగి బరిలోకి దిగి విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇదంతా సానుకూల ఆలోచనతోనే సాధ్యమవుతుంది. ఇక పృథ్వీతో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది.

సెంచరీలు ఎందుకు చేయడం లేదు...?
నా బ్యాటింగ్ విషయానికొస్తే.. ప్రాథమిక అంశాలపై దృష్టిసారించి అందుకు అనుగుణమైన ఫుట్‌వర్క్‌తో ఆడాలనుకున్నా. ఇకపైనా ఇలాగే రాణిస్తాననే నమ్మకం ఉంది. అయితే, జోస్ బట్లర్‌లా నేనెందుకు శతకాలు చేయలేకపోతున్నానని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలందరూ క్రికెట్‌ను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అందుకు నాకు ఆనందంగా ఉంది. నా పిల్లలు కూడా క్రికెట్‌ను అర్థం చేసుకుంటున్నారు. 'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

తల్లడిల్లిన బిడ్డలు..
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (66) పరుగులు చేసి ఔటయ్యాక ఆ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ రోజు వార్నర్.. హసరంగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరినప్పుడు గ్యాలరీలో అతడి కుమార్తెలు కంటతడి పెట్టిన చిత్రాలు వైరల్‌గా మారాయి. దీంతో తాను ఎక్కువ పరుగులు చేయాలని తన కుమార్తెలు ఆశపడుతున్నట్లు వార్నర్ అభిప్రాయపడ్డాడు.ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాక వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో దూసుకుపోతున్నాడు.

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో..
దీంతో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 63.67 సగటుతో 191 పరుగులు చేశాడు. అతడిలాగే రెచ్చిపోతే ఈ సీజన్‌లోనూ టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తాడు. మరోవైపు రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ ఆరు మ్యాచ్‌ల్లో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలతో మొత్తం 375 పరుగులు సాధించాడు. అతడి సగటు 75గా నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications