
లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ అసాధారణ బౌలింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అతని ధాటికి తమ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా విఫలమయ్యాని చెప్పాడు. కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడం.. చివరి ఓవర్‌లో ధారళంగా పరుగులివ్వడం.. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం తమ ఓటమికి కారణాలని చెప్పాడు.
'ఈ మ్యాచ్ మాకు సవాల్ విసిరింది. ఆరంభంలో మా పేస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌పై పట్టు లభించింది. మా పేసర్లు పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడంతో మూమెంటమ్ లక్నోవైపు మళ్లింది. అయితే మా తప్పిదాలతో పాటు లక్నో టీమ్ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో భారీ స్కోర్ చేసింది.
ఈ వికెట్‌పై 170 పరుగులు చేయడమే గొప్ప. కానీ లక్నో భారీ లక్ష్యాన్ని మా ముందుంచింది. చేజింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. కానీ మార్క్ వుడ్ ఆ అవకాశాన్ని మాకు ఇవ్వలేదు. అసాధారణమైన బౌలింగ్‌తో పాటు తన అనుభవంతో మా పతనాన్ని శాసించాడు. అతను రెండు వైపులా బౌలింగ్ చేస్తుంటే.. రెండు పిచ్‌లపై వేస్తున్నట్లు అనిపించింది. మా తప్పిదాలను సమీక్షించుకుంటాం.
ఇది తొలి మ్యాచే. మా సొంతగడ్డపై మా ఫ్యాన్స్ మధ్య పుంజుకుంటాం. మా సత్తా ఏంటో చూపిస్తాం.'అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కైల్ మేయర్స్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), ఆయూష్ బదోని(18) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. డేవిడ్ వార్నర్(48 బంతుల్లో 7 ఫోర్లతో 56), రిలీ రోసౌ(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30)టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్(5/14) ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.