
అబుదాబి: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్న తన నిర్ణయం సరైందేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. పిచ్ స్వభావం కారణంగానే బ్యాటింగ్ తీసుకున్నానని, ఫలితంతో తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపానికి గురవ్వడం లేదని స్పష్టం చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. బ్యాట్స్‌మెన్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో 30-40 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు.
'ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్న నా నిర్ణయం సరైందే. ఈ వికెట్‌పై మ్యాచ్ సాగే కొద్ది వేగంగా ఆడటం కష్టంగా మారిపోతుంది. మా బలమంతా డెత్ బౌలింగ్‌లోనే ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు నేను తీసుకున్న నిర్ణయంపై పశ్చాత్తాపం లేదు. దానికి కట్టుబడి ఉన్నా. కమిన్స్ కట్టుదిట్టమైన టెస్టు మ్యాచ్ తరహా లైన్ అండ్ లెంగ్త్‌తో తనకు తెలిసిన విద్యను చక్కగా ప్రదర్శించాడు. మధ్య ఓవర్లలో మేం చాలా నెమ్మదిగా ఆడి తక్కువ పరుగులే చేశాం. బహుశా అక్కడే మాకు నష్టం జరిగింది. మరో 30-40 పరుగులు చేస్తే బాగుండేది. టాపార్డర్‌లో ఉన్నవారంతా దూకుడుగా ఆడేందుకే ప్రయత్నించాం. కానీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పుడు సహజంగానే మనం ఏమీ చేయలేం. మా ఇన్నింగ్స్ దాదాపు 35-40 డాట్ బంతులు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఇలా ఆడితే కుదరదు'అని డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 ), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 30) మోస్తరుగా ఆడారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్, వరున్, రస్సెల్ తలో వికెట్ తీశారు. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు 70 నాటౌట్), మోర్గాన్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నటరాజన్, రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.