
సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులకు టిక్‌టాక్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఈ సమాయానికి ఐపీఎల్ ఆడుతూ.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత అభిమానులను.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఈ పవర్ హిట్టర్ అలరించేవాడు. కానీ ఈ ఏడాది కరోనా గత్తర పుణ్యమా.. ఐపీఎల్ 2020 సీజన్ నిరవదికంగా వాయిదా పడింది. దీంతో తన బ్యాట్ మూగబోయినా.. అభిమానులను మాత్రం అదే రీతిలో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
ఇటీవల అల వైకుంఠపురములో.. చిత్రంలోని బుట్టబొమ్మ 'రాములో రాములా' పాటలకు తన భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత పోకిరి చిత్రంలోని ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ చెప్పాడు. నిన్న బాహుబలి చిత్రం నుంచి 'అమరేంద్రం బాహుబలి అను నేను' అనే డైలాగ్‌తో అదరగొట్టాడు.
తాజాగా ప్రేమికుడు సినిమాలోని ముక్కాల ముక్కాబుల పాటకు టిక్‌టాక్ చేశాడు. తన భార్య క్యాండిస్‌తో కలిసి ప్రభూదేవా స్టైల్లో స్టెప్పులేశాడు. మధ్యలో కూతురు ఇవీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంది. ఈ వీడియోను వార్నరే 'ఎవరు బాగా చేసారు.. మేమా? లేక శిల్పాశెట్టా? లేక ఒరిజనల్ ప్రభూదేవానా?'అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు.
అయితే అలవైకుంఠపురం చిత్రంలోని రెండు సాంగ్స్‌కు వార్నర్ టిక్ చేయడంతో.. ఆ మూవీకి పోటీగా విడుదలైన సూపర్‌స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లోని 'మైండ్‌బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని అభిమానులు వార్నర్‌ను కోరుతున్నారు. చాలా మంది ఈ విషయమై అతనికి ట్వీట్ చేశారు. అయితే ఈ పాటకి తాను డ్యాన్స్ చేయలేకపోతున్నానని వార్నర్ తాజాగా తెలిపాడు. అందుకు కారణం కూడా చెప్పాడు.'ఈ పాటకి నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే అది ఆస్ట్రేలియాలో యాప్‌లో అందుబాటులో లేదు. ఒకసారి అందుబాటులోకి వస్తే.. నేను మైండ్‌బ్లాక్ పాటకు టిక్ టాక్ చేస్తాను'' అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు.