పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ప్రీమియం ఆటగాళ్లకు కనీస ఇంగిత జ్ఞానం లేదని, ప్రెస్‌మీట్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని అసహనం వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డేవిడ్ వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2026 సీజన్‌కు నేడు తెరలేవనుంది. ఈ క్రమంలో బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ టోర్నీలో కరాచీ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్.. పాక్ ఆటగాళ్ల తీరును తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రెస్ మీట్‌లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్‌గా వివరిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఒకరిపై ఒకరు జోకులు పేల్చుకుంటూ నవ్వుకున్నారు. వార్నర్ చెప్పే మాటలను పట్టించుకోలేదు. దాంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

'అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. వీళ్లు తమను తాము ప్రీమియం ప్లేయర్స్ అని పిలుచుకుంటున్నారు. కానీ వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల కంటే అధ్వాన్నంగా ఉంది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎలా ప్రవర్తించాలో కూడా వీరికి తెలియదా?'అని మండిపడ్డాడు.
డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వార్నర్‌ను కొందరు తప్పుబడుతుంటే మరికొందరు సమర్థిస్తున్నారు. అంతర్జాతీయ ప్రెస్ మీట్స్‌లో ప్రొఫెషనలిజం ఉండాల్సిందేనని వార్నర్‌కు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా వార్నర్ లాంటి సీనియర్ ప్లేయర్ మాట్లాడుతున్నప్పుడు తోటి ఆటగాళ్లు గౌరవం ఇవ్వకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.