
రాంచీ: భారత్‌తో రెండో వన్డే ముందు సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. క్యాన్సర్‌తో తన చిన్నారి అభిమాని చనిపోయిందంటూ మిల్లర్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. అయితే మిల్లర్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను చూసి అభిమానులు గందరగోళానికి గురయ్యాడు. చనిపోయిన బాలిక మిల్లర్ కూతురుగా భావించి సానుభూతి వ్యక్తం చేశాడు. అయితే చనిపోయింది తన కూతురు కాదని, తనను పిచ్చిగా అభిమానించే ఓ చిన్నారి ఫ్యాన్ అని స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు తెలియజేయడంతో వాస్తవం తెలుసుకున్నారు.
ఆ చిన్నారి అంటే మిల్లర్‌కు చాలా ఇష్టం. 2017 నుంచి ఆమె గురించి మిల్లర్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. అప్పటికీ ఆ చిన్నారి వయసు ఐదేళ్లు. డేవిడ్ మిల్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'రిప్ యూ లిటిల్ రాక్ స్టార్ లవ్ యూ ఆల్‌వేస్' అంటూ ఆ చిన్నారితో కలిసి దిగిన ఫొటోలను శనివారం పోస్టు చేశాడు. 'నేను నిన్ను మిస్సవుతాను. నాకు తెలిసినంత వరకు పెద్ద మనసు నీదే. క్యాన్సర్‌తో ఎనలేని పోరాటం చేశావ్. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో, ముఖంపై చిరునవ్వుతో ఉన్నావ్.

నీ ప్రయాణంలో ప్రతి వ్యక్తి, ప్రతి అవరోధాన్ని హత్తుకున్నావ్. జీవితంలో ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదించాలనే విషయాన్ని నువ్వు నాకు నేర్పించావ్. నీతో కలిసి కొంత దూరం ప్రయాణించగలిగాను. ఐ లవ్ యూ సో మచ్, రిప్'అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. భారత అభిమానులు సైతం ఆ చిన్నారికి సంతాపం తెలియజేస్తున్నారు.
సౌతాఫ్రికా జట్టు భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతుండటంతో... డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాడు. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో మిల్లర్ 63 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నేడు (ఆదివారం) రెండో వన్డే జరగనుంది.