టీ20 ప్రపంచకప్ 2024 ముగిసి రెండు రోజులు అవుతున్నా తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నానని సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. గత శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికా 7 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
ఆఖరి ఓవర్‌లో సఫారీ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. డేవిడ్ మిల్లర్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీ సిక్సర్ కొట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.

డేవిడ్ మిల్లర్ నాటౌట్‌గా నిలిచినా.. ఆ బంతి సిక్సర్‌గా వెళ్లినా.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సునాయసంగా విజయం సాధించేది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తొలిసారి ఫైనల్ చేరిన సఫారీ టీమ్.. తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది.
ఈ పరాజయం అనంతరం డేవిడ్ మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. తన సతీమణి భుజాలపై తలపెట్టి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. తన వల్లే సౌతాఫ్రికా ఓడిందనే బాధ అతన్ని బాగా వెంటాడుతోంది.
తాజాగా తమ పరాజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన డేవిడ్ మిల్లర్.. ఈ బాధను వర్ణించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
'నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. ఫైనల్ ముగిసి రెండు రోజులు గడిచినా.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ బాధను వర్ణించలేకపోతున్నాను. ఈ టోర్నీలో మా జట్టు కనబర్చిన పోరాటం పట్ల గర్వంగా ఉంది.
ఈ నెలలో ఎన్నో ఒడి దొడుకులు మధ్య మా జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. మేం ఎంతో బాధను భరించాం. కానీ ఈ జట్టు అద్భుతంగా పుంజుకుంటుందనే నమ్మకం నాకుంది.'అని డేవిడ్ మిల్లర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. గతంలో ఏడు సార్లు సెమీఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఈ ఓటమితో 35 ఏళ్ల డేవిడ్ మిల్లర్ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైతే డేవిడ్ మిల్లర్ తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.