కొలంబో: పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడమే తమ ఓటమిని శాసించిందని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా మంగళవారం భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే విషయాన్ని అంచనా వేయలేకపోయామని, 10 ఓవర్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించామని తెలిపాడు.
అప్పటికీ తమకు అందుబాటులో ఉన్న పార్ట్ టైమ్ స్పిన్నర్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించామని చెప్పాడు. అయితే ముందే ఈ విషయాన్ని గ్రహిస్తే టీమిండియా మరింత తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేదని, అప్పుడు తమ విజయానికి ఆస్కారం ఉండేదన్నాడు. బ్యాటింగ్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

విరాట్ కోహ్లీ వికెట్ తీయగానే ఈ రోజు దునిత్ వెల్లలాగే చెలరేగుతాడని భావించానని తెలిపాడు. 'ఈ తరహా వికెట్‌ను మేం అస్సలు ఊహించలేదు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్ అనుకున్నాం. కానీ 10 ఓవర్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించి ఈ అడ్వాంటేజ్‌ను గొప్పగా వాడుకున్నాం. పార్ట్‌టైమ్ స్పిన్నర్లు అయినా చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వా సాయంతో భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాం.
ఈ ఇద్దరూ బ్యాటర్లు నెట్స్‌లో తరుచూ బౌలింగ్ చేస్తుంటారు. ఈ ఇద్దరికీ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఈ రోజు వారి బౌలింగ్‌ను ఉపయోగించుకున్నా. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్లలాగే ఆట చూసి అతను భారత్‌తో సత్తా చాటుతాడని గ్రహించా. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన క్షణమే ఈ రోజు వెల్లలాగేకు తిరుగులేదని భావించా. మరిన్ని వికెట్లు తీస్తాడని అనుకున్నా.'అని డసన్ షనక చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా ఆసియాకప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడినా ఫైనల్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు.